స్వామి నోరు కట్టేశారా?
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి నోరును బీజేపీ కట్టేసిందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఓ పక్క ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడమే కాకుండా దేశంలో అత్యున్నత పదవులు అలంకరించిన వారిని సొంత పార్టీల నేతలను సైతం ఆయన వదిలిపెట్టకుండా విమర్శలు కుప్పించారు. గత పార్లమెంటు సమావేశాల సమయంలో కీలక పాత్ర పోషించి ప్రతిపక్షాలను నోరు మెదపకుండా చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఈసారి మాత్రం మిన్నకుండా పోయారు. కనీసం ఒక్కసారి కూడా ఆయన రాజ్యసభ చర్చలో కనిపించడం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంగానీ, గుజరాత్ దళితుల దాడి అంశంపై గానీ కాంగ్రెస్ పార్టీ అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడుతోంది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఏదో ఒక కొత్త అంశాన్ని ఆధారాలతో సహా బయటకు తెచ్చి ఇరకాటంలో పెట్టే సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి మాత్రం అలాంటి పనిచేయడం లేదు. అయితే, ఆయన గత రాత్రి మాత్రం ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ మాత్రం ఆయన నోరును బీజేపీ మూయించిందనే విషయాన్ని పరోక్షంగా చెబుతోంది.
అందులో ఆయన ఏం చెప్పారంటే.. 'నేను మౌనంగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో దౌర్జన్యకాండ చేస్తోంది. నా మౌనానికి దీనికి సంబంధం ఉందా.. లేదా అలా జరిగిపోతుందా?' అంటూ ఆయన అందులో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్, అరవింద్ సుబ్రహ్మణియన్, శక్తికాంతా దాస్, ఆఖరికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సైతం సుబ్రహ్మణ్య స్వామి విమర్శించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఓ ఇంటర్వ్యూలో స్వామి మాటలను సమర్థించలేదు. స్వామి మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పార్టీకి ఇబ్బందికలిగించే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు చెప్పిన నేపథ్యంలో ఆయనను నోరు మూపించినట్లు తెలుస్తోంది.