హవల్దార్ హంగ్‌పాన్‌కు అశోక చక్ర
►82 మందికి సాహస పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: అక్రమంగా భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, దేశం కోసం ప్రాణాలర్పించిన హవల్దార్ హంగ్‌పాన్‌కు ఆర్మీ అత్యున్నత పీస్‌టైమ్ అవార్డు అశోక చక్ర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పఠాన్‌కోట్ వీరులు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, కార్పోరల్ గురుసేవక్ సింగ్ తదితర 82 మంది రక్షణ, పారామిలిటరీ సిబ్బందికి సాహస పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఒక అశోక చక్ర, 14 శౌర్య చక్ర, 63 సేన పతకాలు, రెండు నావికా సేన, రెండు వాయు సేన పతకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు అందజేయనున్నారు.
హంగ్‌పాన్‌కు సముచిత గౌరవం
అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరుడైన హవల్దార్ హంగ్‌పాన్ దాదాకు ప్రతిష్టాత్మక అశోక చక్ర పురస్కారం లభించింది. ఆయన గత మే 27న కశ్మీర్‌లో 13 వేల అడుగుల ఎత్తులో శత్రువులతో వీరోచితంగా పోరాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారీగా ఆయుధాలతో భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత శత్రుమూకల బుల్లెట్లకు నేలకొరిగారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల బోడురియా గ్రామానికి చెందిన హంగ్‌పాన్‌ను ఆయన టీమ్ సభ్యులు దాదా అని పిలుచుకునేవారు. కిందటేడాది చివర్లోనే ఆయన కశ్మీర్‌కు వెళ్లారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 35 రైఫిల్ టీమ్స్‌లో హంగ్‌పాన్ విధులు నిర్వర్తించేవారు. హంగ్‌పాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పఠాన్‌కోట్ అమరవీరుడికి శౌర్య చక్ర
పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో మరణించిన ఎన్‌ఎస్ జీ బాంబు నిర్వీర్య దళం చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు శౌర్య చక్ర పురస్కారం లభిం చింది. బాంబులను కనుగొనడంలో, నిర్వీర్యం చేయడంలో నిష్ణాతుడైన నిరంజన్ గత జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో గ్రనేడ్లను నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఐటీబీపీ కమాండోలకు పురస్కారాలు
అఫ్గానిస్తాన్‌లోని భారత్ కాన్సులేట్ల వద్ద ఉగ్రదాడులను ఎదుర్కొన్న పదిమంది ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కమాండోలకు అత్యున్నత పోలీసు సాహస పతకాలను ఇవ్వనున్నారు. వీరిలో క్షురకుడిగా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ దాడులు జనవరి 3న మజారే షరీఫ్ వద్ద, మార్చి 3న జలాలాబాద్ వద్ద ఉన్న భారత కాన్సులేట్ల వద్ద జరిగాయి. మజారే షరీఫ్ కాన్సులేట్ వద్ద జరిగిన దాడుల్లో సతీశ్ రైఫిల్‌ను అందిపుచ్చుకుని అద్భుతంగా ఎదురు కాల్పులు జరిపారు. అలాగే 948 మంది కేంద్ర, రాష్ట్ర పోలీసులకూ సాహస పురస్కారాలు, సేవా పతకాలు ఇవ్వనున్నారు.