సాక్షి, బెంగళూరు : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ భార్య సాధనా ఠాకూర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో తప్పిపోయిన మైసూరుకు చెందిన మహిళను కర్ణాటకకు చేర్చడంలో సాయం చేసినందుకుగానూ ధన్యవాదాలు తెలిపేందుకు ఫోన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సాధనా ఠాకూర్ కన్నడలో మాట్లాడటంతో తనకెంతో సంతోషం కలిగిందన్నారు.
అసలు విషయమేమిటంటే... మైసూరుకు చెందిన ముప్పై ఏళ్ల మహిళను రెండేళ్ల క్రితం ఆమె భర్త వదిలేశాడు. దాంతో మతిస్థిమితం కోల్పోయిన ఆమె.. అతడిని వెదుక్కుంటూ హిమాచల్ ప్రదేశ్ చేరుకున్నారు. కానీ కన్నడ తప్ప వేరే భాష రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్లుగా ఆమెను గమనిస్తున్న స్థానికులు అతి కష్టం మీద ఆమెను కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు. దీంతో స్థానిక ప్రభుత్వాధికారులకు సమాచారం ఇవ్వడంతో టీవీ చానెళ్లలో ఆమె గురించి ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సాధనా ఠాకూర్ సదరు మహిళను సీఎం అధికారిక నివాసానికి పిలిపించుకున్నారు. సాధన కూడా కన్నడలో మాట్లాడటంతో ఆ మహిళకు తన వివరాలు చెప్పడం తేలికైంది. సదరు మహిళ గురించి సాధనా ఠాకూర్ కర్ణాటక ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. తర్వాత ఆమెను సురక్షితంగా కర్ణాటకకు పంపించారు.
ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే షిమ్లా వెళ్లి వారిని కలుస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మహిళను ప్రభుత్వ హోంకు తరలించినట్లు తెలిపారు. కుమారస్వామి ఫోన్ చేయడం గురించి మాట్లాడుతూ.. తాను కన్నడిగనే అని తెలుసుకున్న కుమారస్వామి ఎంతో సంతోషించారని, ఆయన ఎంతో దయాగుణం కలవారని సాధనా ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment