సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంటే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ప్రజలకు అసాధారణ సలహా ఇచ్చారు. గోమూత్రంతో క్యాన్సర్‌కు చికిత్స అందించవచ్చని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి తాజాగా కరోనా వైరస్‌ను అధిగమించేందుకు 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలని సూచించారు. సూర్యరశ్మితో వైరస్‌ను చంపేందుకు అవసరమైన వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని, ఈ సమయంలో మనం ఎండలో కూర్చుంటే మన శరీరంలో విటమిన్ డీ నిల్వలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఇలా చేస్తే వ్యాధి నిరోధక శక్తి మెరుగై కరోనా వైరస్ వంటి వైరస్‌లను చంపవచ్చని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారిపై అశాస్ర్తీయ వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలు, మంత్రులకు సూచించిన క్రమంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా వైరస్‌ను నియంత్రించే ముందస్తు చర్యలపై సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మూడు పేజీల డాక్యుమెంట్‌లో ఎక్కడా విటమిన్ డీని పొందాలని లేదా ఎండ తగిలేలా చూసుకోవాలని కానీ లేకపోవడం విశేషం. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డీ పొందడం వాస్తవమే అయినా ఈ విటమిన్ లేదా సూర్యరశ్మి ద్వారా కోవిడ్-19 వైరస్ నుంచి రక్షణ పొందవచ్చనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. మరోవైపు గోమూత్రం, ఆవు పేడ ద్వారా కరోనా వైరస్‌కు చెక్ పెట్టవచ్చని అసోం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే అశాస్త్రీయమైన ఇలాంటి చిట్కాలను ఎవరూ అనుసరించవద్దని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటికి మోచేయి అడ్డుపెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment