
పొంచివున్న వడగాలి పంజా!
► రెండేళ్ల కిందట తెలుగురాష్ట్రాలను గడగడలాడించిన పెను వడగాడ్పు
► 2015 మే చివర్లో ఆంధ్ర, తెలంగాణల్లో 2,500 మంది మృత్యువాత
► భూతాపానికి లింకు.. పదేళ్లలో ఒకసారి పునరావృతమయ్యే ప్రమాదం
► కొంతమేరకైనా కాపాడుతున్న హైదరాబాద్ నగరంపై కాలుష్యం దుప్పటి
► ఆ దుప్పటి తొలగిస్తే ప్రతి రెండేళ్లలో ఓసారి పెను వడగాడ్పుల విజృంభణ
► వడగాడ్పులపై భారత, విదేశీ వాతావరణ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
► ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సంసిద్ధం కావాలంటున్న పరిశోధకులు
సరిగ్గా రెండేళ్ల కిందట.. వేసవి కాలం.. మే నెలలో చివరి వారం.. ఎండలు భగభగమండుతున్నాయి.. ఒక్కసారిగా వడగాడ్సులు ఉధృతమయ్యాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు. పదీ ఇరవై వందా అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఏకంగా రెండున్నర వేల మంది వడగాలుల దెబ్బకు అసువులుబాశారు. ఈ ప్రాంతంలో ఆస్థాయి వడగాలులు ప్రతి వందేళ్లలో ఒకసారి వస్తాయని అంచనా. కానీ.. భూతాపం పెరగడం కారణంగా ఈ ప్రమాదం ఏకంగా పది రెట్లు పెరిగిపోయిందని వాతావరణ నిపుణుల అంచనా. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పదేళ్లలో ఒకసారి ఆ స్థాయి వడగాడ్పులు వీచే ప్రమాదం పొంచివుంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ మహానగరం, పరిసరాల మీద నింగిలో దట్టంగా ఆవరించివుండే కాలుష్యం దుప్పటి తొలగిపోతే.. ఆ భీకర వడగాడ్పులు ముప్పు ప్రతి రెండేళ్లకోసారి ముంచుకొస్తుందని నిపుణులు చెప్తున్నారు.
మానవ కల్పిత భూతాపంతో లింకు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను గడగడలాడించిన 2015 నాటి భీకర వడగాడ్పుల మీద అధ్యయనం చేసిన భారతదేశం, విదేశాలకు చెందిన పలువురు వాతావరణ నిపుణులు మూడు ప్రధాన సూత్రీకరణలకు వచ్చారు. ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కార్స్టెన్ హాస్టీన్.. ‘ఆ పెను వడగాడ్పులకు మనుషుల వల్ల జరిగిన వాతావరణ మార్పుకు సంబంధం ఉంద’నేందుకు చాలా బలమైన ఆధారాలు కనుగొన్నట్లు చెప్పారు. వాతావరణ ప్రమాదాలపై అవగాహనను పెంపొందించే అంశం మీద ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీలో జరిగిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ అధ్యయన నివేదికను అమెరికన్ మెటియోరాలాజికల్ సొసైటీ బులెటిన్లో ప్రచురణ కోసం సమర్పించారు.
కాలుష్య దుప్పటిని తొలగిస్తే మరింత వేడి
‘మున్ముందు ఇప్పటికన్నా మరింత తీవ్రమైన వడగాడ్పులు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సంసిద్ధం కావాల్సి ఉంది. అలాగే పారిశ్రామిక కార్యకలాపాలు, రవాణా వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాలను శుభ్రం చేసినట్లయితే.. మరింత బలమైన వడగాడ్పులు వస్తాయి. గతంలో ఉత్తర అమెరికా, యూరప్లలో ఇదే విధంగా జరిగింది’ అని ఆ సమావేశంలో పరిశోధకులు హెచ్చరించారు. దక్షిణాసియా భూభాగాన్ని ఎక్కువగా కప్పివుంచే కాలుష్యం దుప్పటి.. సూర్యుడి వేడిమిలో కొంతైనా భూ ఉపరితలాన్ని తాకకుండా నిరోధిస్తోంది. అయితే.. దీనర్థం గాలి కాలుష్యం మంచిదని కాదు. గాలి కాలుష్యం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా డెబ్బై లక్షల మందిని బలితీసుకుంటోంది. వర్షపాతం మీద ప్రతికూల ప్రభావం కూడా చూపుతోంది. ఈ గాలి కాలుష్యాన్ని శుభ్రం చేసే క్రమంలో మరింత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు ముందుగా సంసిద్ధం కావాలి.
ముందుగా పసిగట్టగలిగితే ప్రయోజనం
అయితే.. వడగాడ్పులకు భూతాపానికి సంబంధం ఉందని సూత్రప్రాయంగా చెప్పటం సరిపోదని.. ఇటువంటి పెను వడగాడ్పులు ఏ నెలలో రావచ్చు, ఎన్ని రోజులు కొనసాగవచ్చు అనేది ముందస్తుగా అంచనావేయగలిగితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోగలదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విపత్తు నిర్వహణ విభాగ అధికారి నాగేంద్ర కె. బియానీ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఏదేమైనా గానీ వడగాడ్పులను ఎదుర్కోవడానికి తాము ఎప్పుడూ ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కానీ.. ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల వల్ల జబ్బుపడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తే.. ఈ ప్రణాళికలు ఏమాత్రం సరిపోవడం లేదన్నది స్పష్టమవుతోంది.
అహ్మదాబాద్ వడగాడ్పు కార్యాచరణ ప్రణాళిక మంచి మార్గదర్శకమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ 2010లో వడగాడ్పుల మరణాల సంఖ్య 700 గా ఉంటే.. 2015 నాటికి అది 20కి తగ్గిపోయింది. అటువంటి ప్రణాళికనే విజయవాడ కోసం అభివృద్ధి చేసినట్లు బియానీ తెలిపారు. అయితే.. ఈ విషయంలో వివిధ మంత్రిత్వశాఖలు, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల మధ్య చాలా సమన్వయం అవసరమవుతుందన్నారు.
హ్యుమిడిటీ పెరిగితే మరింత తీవ్రం
గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉండడం వల్ల వడగాడ్పుల ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు కృష్ణా అచ్యుతరావు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎట్ బర్కిలీ, లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులతో కలిసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు చెప్పారు. 2015 మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెను వడగాడ్పుల వెంటనే పాకిస్తాన్లోని కరాచీలో కూడా అదే తరహా వడగాడ్పులు విజృంభించాయి. అక్కడ 700 మంది మృత్యువాతపడ్డారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే కరాచీలో వడగాడ్పుల సమయంలో ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అయినా కరాచీలో వడగాడ్పుల తీవ్రతకు ప్రధాన కారణం.. అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ తేమ శాతం 20 శాతంగా ఉంటే.. కరాచీలో 35 శాతం నుంచి 70 శాతం వరకూ నమోదైంది. ఈ తేమశాతం ప్రభావంపై ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ప్రత్యేక సూచికలు ఉంటాయి. కానీ అవి దక్షిణాసియా దేశాలకు వర్తించవు. ఈ నేపథ్యంలో దక్షిణాసియాకు వర్తించే విధంగా.. ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ తదితర వివరాలతో కూడిన వేడి సూచికలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఇటువంటి సూచికలు ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించడానికి దోహదం చేస్తాయి.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్ (దథర్డ్పోల్.నెట్ సౌజన్యంతో)