రెండు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
మహారాష్ట్రలో 64 శాతం, హర్యానాలో 76 శాతం
{పశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
హర్యానా చరిత్రలో ఇదే భారీ పోలింగ్
ముంబై/చండీగఢ్: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికలు బుధవారం భారీ పోలింగ్‌తో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం గా ముగిశాయి. పంచముఖ పోటీ నెలకొన్న మహారాష్ట్రలో 64 శాతం పోలింగ్, త్రిముఖ పోటీ నెలకొన్న హర్యానాలో ఆ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో 76 శాతం పోలింగ్ నమోదైంది. హర్యానాలో 1967లో చివరిసారి నమోదైన భారీ పోలింగ్ 72.65 శాతం కంటే ఈసారి దాదాపు నాలుగు శాతం ఎక్కువ రికార్డయింది. పూర్తి వివరాలు అందాక పోలింగ్ ఇంకా పెరిగే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. హర్యానాలో 2009 ఎన్నికల్లో 72.37 శాతం, మహారాష్ట్రలో 59.49 శాతం పోలింగ్ జరిగింది. తాజా ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 19న జరగనుంది.
మహారాష్ట్రలో..: 8.35 కోట్లమంది ఓటర్లున్న మహారాష్ట్రలో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఉదయం వేగంగా మొదలై మధ్యాహ్నానికి తగ్గి, సాయంత్రానికి మళ్లీ పుంజుకుంది. మొత్తం 288 సీట్లకు ఎన్నిక లు జరిగాయి. 4,119 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఓటేసిన ప్రముఖుల్లో మాజీ సీఎం పృథీరాజ్ చవాన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే తదితరులు ఉన్నారు. నాగపూర్ జిల్లాలోని పారశివనిలో పిడుగుపడడడంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గడ్చిరోలి జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో నక్సలైట్లు పోలీసులపై, ఎన్నికల సిబ్బందిపై కాల్పులు జరిపారు చాముర్తి తాలూకా మక్కెపెల్లి వద్ద బ్యాలట్ బాక్సులు తీసుకెళ్తున్న సిబ్బంది లక్ష్యంగా నక్సల్స్ మందుపాతర పేల్చి కాల్పులు జరపగా ఒక పోలీసు గాయపడ్డాడు. గెదా గ్రామం వద్ద పోలింగ్ బూత్‌కు దగ్గర్లో నక్సల్స్, పోలీసుల మధ్య 15 నిమిషాలు కాల్పులు జరిగాయి.
హర్యానాలో..: హర్యానాలోని మొత్తం 90 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 1.63 కోట్ల మంది ఓటర్లున్న ఈ రాష్ట్రంలో 1,351 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్డీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న హర్యానాలో సీఎం భూపీందర్‌సింగ్ హూడా(కాంగ్రెస్), అభయ్ చౌతాలా(ఏఎన్‌ఎల్డీ) తదితర ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో భారీ పోలింగ్ నమోదైంది. హిస్సార్ జిల్లాలోని బర్వాలా, మేవాత్ జిల్లా పున్హానా తదితర చోట్ల ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది పోలీసులు సహా 32 మంది గాయపడ్డారు. కాగా, మహారాష్ట్ర, హర్యానాల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు అన్నీ ధీమా వ్యక్తం చేశాయి.
తరలి వచ్చిన సినీతారలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ అగ్రతారలు, వివిధ రంగాల ప్రముఖులు బిజీబిజీ షెడ్యూళ్లను పక్కనపెట్టి మరీ పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ముంబైలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, హేమమాలిని, రేఖ, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్ తదితరులు ఓటు వేశారు.