తెలంగాణ హైకోర్టుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం లోక్సభలో ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం లోక్సభలో ప్రకటన చేశారు. హైకోర్టు విభజనకు భవనాలు, క్వార్టర్స్ కావాలని, మౌలిక వసతులు సంబంధిత రాష్ట్రమే కల్పించాలన్నారు. ఏపీలో ప్రత్యేక హైకోర్టు కోసం స్థలాన్వేషణ జరుగుతుందన్నారు. ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపాకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు నిర్ణయం తీసుకుంటే కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుందని, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు.
హైకోర్టు విభజనపై ప్రస్తుతం ఓ పిల్ దాఖలైందని, మే 1న హైకోర్టు ఇచ్చిన తీర్పులో...హైకోర్టు ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలని ఆదేశించగా, తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని సదానంద అన్నారు. ఆ పిటిషన్పై ఆగస్టు 14న తదుపరి విచారణ జరగనుందని, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని సదానంద తెలిపారు.
కాగా మంత్రి సదానంద గౌడ ప్రకటనపై టీఆర్ఎస్ ఎంపీలు పెదవి విరిచారు. మంత్రి ప్రకటనలో కొత్తదనమేమీ లేదని, ప్రత్యేక హైకోర్టు కోసం అన్ని సమకూరుస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.