
నాకంటే ముందే ఆయన స్పందించారు..
ఉత్తర, ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంప పై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోదీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: నేపాల్ దేశంతో పాటు ఉత్తర, ఈశాన్య భారతావనిని వణికించిన భూకంపంపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. వార్త తెలిసిన ఐదు నిమిషాల్లోనే ప్రధాని మోదీ తనను అప్రమత్తం చేశారన్నారు. తనకంటే ముందే విషయం తెలుసుకున్న ప్రధాని తక్షణమే రంగంలోకి దిగడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. దాదాపు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడి, పరిస్థితిని సమీక్షించారన్నారు.
నేపాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు అవసరమైన అత్యవసర వీసా విషయంలో అధికారులకు తాత్కాలిక ఆదేశాల జారీకి ప్రధాని అంగీకరించారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భూకంపం బారిన పడ్డ దేశ ప్రజలను, నేపాల్‌లోని భారతీయులను కూడా అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. భూకంపం సంభవించిన బీహార్, యూపీ తదితర ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బాధితులకు అన్నీ సేవలు అందిస్తున్నాయన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం మాట్లాడుతున్న మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, సాధారణ స్థితి వచ్చేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని రాజ్‌నాథ్ ప్రకటించారు.