2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా ఒక దశ మిగిలివుంది. అయితే 2019తో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది. ఇది బీజేపీకి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక మీడియా సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే అది బీజేపీకి ప్రతికూలమేమీ కాదని, ఓటింగ్ శాతం తగ్గడానికి ఎండవేడిమి ప్రధాన కారణమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇండియా కూటమి విశ్వసనీయతపై పలు సందేహాలు ఉన్నాయని, ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో చాలా జాప్యం జరిగిందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగినవని అన్నారు. ఇందుకు పంజాబ్‌లోని రాజకీయ పరిస్థితులే ఉదాహరణ అన్నారు. ఇండియా కూటమి ప్రజలకు ఉమ్మడి సందేశాన్ని ఇవ్వలేకపోయిందని, అందుకే ఈ కూటమిపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని చాలామంది భావిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.
ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి కారణం ఎండ వేడిమి అని అన్నారు. గత ఎన్నికల్లో ఇంతటి వేడి లేదన్నారు. ఈసారి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో 25 శాతం మంది దారిద్య్ర రేఖ నుంచి బయటపడ్డారని, దేశంలో నిరుద్యోగం గతంలో కన్నా తగ్గిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment