
ప్రధానితో రాష్ట్రపతి కుటుంబం.(ఎడమ నుంచి.. కోవింద్ కూతురు స్వాతి, భార్య సవిత, మనుమరాలు, మనుమడు, కుమారుడు ప్రశాంత్, కోడలు)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖులకు పరిచయస్తులు కావడమే అదేదో అర్హత అయినట్లు వెళ్లినచోటల్లా హడావిడిచేస్తుంటారు కొందరు. ఇక ఆ ప్రముఖుడి కుటుంబసభ్యులైతేనా.. పొందే వీఐపీ ట్రీట్మెంట్లు, చేసే రచ్చ ఏమాత్రం తక్కువ ఉండదు. అయితే అందరు ప్రముఖులూ అలా ఉండరు. అప్పనంగా ప్రత్యేక సేవలు చేయించుకోరు, కొన్నిసార్లు ప్రోటోకాల్ హక్కుల్ని సైతం వదిలేసుకుని హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకి మన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మొన్న రిపబ్లిక్‌డేనాడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.
జాతీయ పండుగ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబసభ్యులను ఆహ్వానించలేదు. భార్య సవితను మాత్రమే కోవింద్ తనతో తీసుకెళ్లారు. ఎట్ హోమ్ అంటే ఏదో రాజకీయ వందనాలు, మొహమాటపు పలకరింపులు, అక్కరలేని ఆహ్వానితులతో జరగకూడదని రాష్ట్రపతి భావించారట. కార్యక్రమ ప్రాంగణం.. స్ఫూర్తిదాయక సమ్మేళనంలా, చక్కటి సృహృద్భావ వాతావరణంలో, ప్రేరణను ఇచ్చే, ప్రేరణ పొందే వ్యక్తులతో కళకళలాడాలని కోరుకున్నారట. ఈ క్రమంలోనే తన కుటుంబీకులను కూడా ఆహ్వానించవద్దని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.
గతేడాది 2వేల మంది.. ఈసారి 724 మాత్రమే : రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈ సారి అతితక్కువగా 724 మందిని మాత్రమే ఆహ్వానించారు. గతేడాది(2017లో) 2015 మందికి ఆహ్వానాలు వెళ్ళగా, అంతకుముందు(2016లో) 2,347 మందిని వేడుకకు పిలిచారు. ప్రణబ్ వారసుడిగా పదవి చేపట్టిన కోవింద్.. గతానికి భిన్నంగా అతికొద్దిమందిని, అదికూడా అరుదైన వ్యక్తులను భవన్‌లోకి ఆహ్వానించారు. ఆసియాన్ దేశాల అధినేతలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేబినెట్ మంత్రులు, ముఖ్య అధికారులు, అమరవీరుడు, ‘అశోకచక్ర’ జ్యోతి ప్రకాష్ నిరాలా కుటుంబం, అండర్-17 ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ సారథి అమర్‌జిత్ సింగ్, దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(డిక్కీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన మిలింద్ కాంబ్లే, సీబీఎస్‌ఈ, ఐఎస్‌సీ, యూపీఎస్సీ పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారు, క్రీడారంగంలో సత్తా చాటుకున్న ఫొగట్ సోదరీమణులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతీయువకులు రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్నవారిలో ఉన్నారు.
రాష్ట్రపతి కుమార్తె విధులు మారారు : రామ్‌నాథ్‌కోవింద్-సవిత దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె స్వాతి, కుమారుడు ప్రశాంత్ కుమార్. వీరిద్దరూ ప్రచారానికి చాలా దూరంగా ఉంటారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యేంత వరకు స్వాతి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. అయితే, భద్రతాకారణాల వల్ల ఇప్పుడామె గ్రౌండ్ డ్యూటీకి మాత్రమే పరిమితమయ్యారు. కొవింద్ కుమారుడు ప్రశాంత్ కుమార్ ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.