
ఆమె రాజస్థాన్‌లో ఉందా?!
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధ మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ముఖ్య అనుచరురాలు హనీప్రీత్ ఇన్సాన్ రాజస్థాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మొబైల్ ఫోన్ సిగ్నల్స్ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ట్రేస్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేస్తేనే డేరాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. గుర్మీత్‌కు శిక్ష పడ్డాక.. హనీప్రీత్ కనిపించకుండా పోయారు. ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేసేందుకు లుక్‌అవుట్ నోటీస్‌ను పోలీసులు ఇచ్చారు. రెండురోజుల కిందట.. హనీప్రీత్ ఫొటోలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల, ప్రధానంగా సరిహధ్దు ప్రాంతాల్లోని స్టేషన్లకు పంపారు. ఈ నేపథ్యంలో హనీ ప్రీత్ ఫోన్ రాజస్థాన్‌లో ట్రేస్ అవడం పెద్ద విషయమేనని అధికారులు చెబుతున్నారు. నిన్నరాత్రి హనీప్రీత్ తన మొబైల్ నుంచి డేరా ఉన్నతాధికారికి ఫోన్ చేసిందని.. ఆ ఫోన్‌వల్లే ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.