కశ్మీర్‌పై వాడివేడి చర్చ
ప్లెబిసైట్ కావాలన్న సింధియా
- పాక్ ఉగ్రక్రీడలు మానుకోవాలి: ఎంజే అక్బర్
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో.. అక్కడ ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా బుధవారం లోక్‌సభలో కోరారు. భారత కిరీటమైన కశ్మీర్‌ను పీడీపీ-బీజేపీ ప్రభుత్వం అవమనిస్తోందన్నారు. కశ్మీర్‌పై చర్చ ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో శాంతి నెలకొనటంతోపాటు అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలని, ఇది కేవలం మానవత్వం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప తుపాకీ గొట్టంతో కాదన్నారు. విదేశాంగ విధానంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందన్నారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్‌పై జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్‌కు లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. విపక్షాల విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. కశ్మీర్ పరిస్థితులు సర్దుకునేందుకు అన్నిపార్టీలూ సహకరించాలన్నారు. కశ్మీర్లో ఆందోళనలకు సరైన నాయకత్వం లేదని.. అలాంటప్పుడు ఎవరితో చర్చలు జరపాలని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆడుతున్న ఉగ్రవాద క్రీడ కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, పాక్ ఆ పని మానుకోవాలని విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ అన్నారు.
విస్తృత స్థాయి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి: చిదంబరం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితికి కాంగ్రెస్ నేత, మాజీ హోంమంత్రి పి.చిదంబరం ఓ పరిష్కారాన్ని ప్రతిపాదించారు. కశ్మీర్ భారత్‌లో చేరినపుడు జరిపిన చర్చలను పునరుద్ధరించి,రాష్ట్రానికి విస్తృత స్థాయి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలన్నారు. లేదంటే దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘కశ్మీర్ భారత్‌లో ఏ చర్చల ప్రాతిపదికన చేరిందోవిస్మరిస్తున్నాం. నమ్మకాన్ని దెబ్బతీశాం. దాని ఫలితంగాభారీ మూల్యం చెల్లించాం’ అని ఓ టీవీ చానల్‌తో అన్నారు. భారత రాజ్యాంగంతో విభేదించని మేరకు కశ్మీర్ సొంత చట్టాలను చేసుకోనివ్వాలన్నారు.