న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య 10 లక్షలు దాటేశాయి. దేశ నలుమూలలకూ పాకిన మహమ్మారిని ఓ చిన్న ప్రాంతం మాత్రం నిలువరించింది. కట్టుదిట్టమైన చర్యలతో, జాగ్రత్తలతో రాకాసిలా దూసుకొస్తున్న కరోనాను మన లక్షదీవులు లోపలికి చొరబడకుండా ఆపేశాయి. (కరోనా : అత్యంత ప్రమాదకర రాష్ట్రాలివే!)
స్కూళ్లను తెరవడానికి అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లక్షదీవుల ప్రభుత్వం అర్జీ పెట్టుకుందంటే, మహమ్మారిపై పోరులో ఈ కేంద్రపాలిత ప్రాంతం ఎంత ముందుచూపుతో ప్రవర్తించిందో అర్థం చేసుకోవచ్చు. లక్షదీవులకు చేరే అన్ని రకాల వస్తువులు కేరళలోని కొచ్చి నుంచి వెళతాయి. ఇక్కడ ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్లే కరోనా ప్రభావం చూపని ప్రాంతంగా లక్షదీవులు వార్తల్లో నిలిచింది. (ఆగస్టు 10 నాటికి 20 లక్షలకు పైమాటే!)
లక్షదీవుల జనాభా 64,473. కరోనా మహమ్మారిగా మారిందని తెలిసిన నాటి నుంచి సరిహద్దులను మూసేసింది. అనుమానితులను ఎక్కువ రోజులు క్వారంటైన్లో ఉంచింది. ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా వ్యాధి లక్షణాలు కనిపించిన 61 మందికి టెస్టింగ్ నిర్వహించింది. వీరందరికీ కరోనా నెగటివ్ వచ్చిందని లక్షదీవుల హెల్త్ సెక్రటరీ డా.ఎస్.సుందరవడివేలు వెల్లడించారు.
ఫిబ్రవరి 1 నుంచి ఓడల్లో, ఫిబ్రవరి 9 నుంచి విమానాల్లో వచ్చిన వారికి టెస్టులు చేసిన తర్వాతే రాష్ట్రంలోకి రానిచ్చినట్లు ఆయన తెలిపారు. రాజధాని అగత్తికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లో, కొచ్చిలోని రెండు హోటళ్లలో 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో ఉంచామని చెప్పారు.
లక్షదీవుల్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలహీనంగా ఉంది. కేవలం మూడే ఆసుపత్రులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా రాకుండా అడ్డుకోగలిగామని సుందరవడివేలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment