సర్కారుకు జరిమానా..! | Human Rights Commission Has Fined The Odisha Government | Sakshi
Sakshi News home page

సర్కారుకు జరిమానా..!

Published Sun, Jan 5 2020 11:13 AM | Last Updated on Sun, Jan 5 2020 11:13 AM

Human Rights Commission Has Fined The Odisha Government - Sakshi

కెంజొహార్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రి

భువనేశ్వర్‌: రక్త మార్పిడి తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. బాధిత వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారం చెల్లించేందుకు కమిషన్‌ 2 నెలల గడువు మంజూరు చేసింది. శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కెంజొహార్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఈ ఘోర తప్పిదం 2016 వ సంవత్సరం డిసెంబరులో జరిగింది. ఈ తప్పిదంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ విచారం వ్యక్తం చేసింది.

రక్త మార్పిడిని పురస్కరించుకుని కెంజొహార్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రి వర్గాల తప్పిదంతో సుఖాంతి నాయక్‌ (45)  అనే మహిళ అకాల మరణానికి గురైంది. కెంజొహార్‌ పాత బస్తీ హడొబొంధొ సాహిలో ఉంటున్న సుఖాంతి నాయక్‌ ఉన్నత చికిత్స కోసం ఈ ఆస్పత్రి మెడిసిన్‌ వార్డులో 2016వ  సంవత్సరం డిసెంబరు  13వ తేదీన భర్తీ అయింది. ఆమెకు ఒక యూనిట్‌ రక్త మార్పిడి చేపట్టాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సలహా మేరకు ఆమె భర్త వీరేంద్ర నాయక్‌ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రక్త నిధి నుంచి లేబొరేటరీ వర్గాలు ఇచ్చిన 1 యూనిట్‌ రక్తం తీసుకుని సంబంధిత నర్సుకు అందజేశాడు. ఈ రక్తం మార్చిన కాసేపటికే ఆయన భార్య సుఖాంతి నాయక్‌ ఆకస్మికంగా కన్నుమూసింది. ఈ సంఘటనపై ఆరా తీయగా తప్పుడు గ్రూపు రక్తం మార్చడంతో ఈ ముప్పు సంభవించినట్లు తేలింది.  కావలసిన గ్రూపు రక్తం బదులుగా వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఖరారైంది.

విధుల నుంచి ఇద్దరు సిబ్బంది తొలగింపు
ఈ విషాద సంఘటనపై జిల్లా ప్రధాన వైద్య అధికారి నిర్వహించిన విచారణలో ఇద్దరు సిబ్బంది బాధ్యులుగా తేలింది. ఈ సిబ్బందిని విధుల నుంచి బహిష్కరించారు. రక్త నిధి లేబొరేటరీ టెక్నిషియన్‌ భారతి మహంత తప్పిదం, విధి నిర్వహణలో స్టాఫ్‌ నర్సు హేమాంగిని మహంత నిర్లక్ష్యంతో చికిత్స కోసం విచ్చేసిన మహిళ మృతి చెందినట్లు నివేదిక వెల్లడించింది. కెంజొహార్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఒకే పేరుతో (సుఖాంతి నాయక్‌) ఇద్దరు వేర్వేరు మహిళా రోగులకు ఒకేసారి రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. ఆస్పత్రి మెడిసిన్, గైనకాలజీ వార్డుల నుంచి రక్త నిధికి రెండు యూనిట్ల రక్తం ఏర్పాటుకు అభ్యర్థనలు జారీ చేశారు. గైనకాలజీ వార్డు రోగికి అ గ్రూపు రక్తం, మెడిసిన్‌ వార్డు రోగికి వేరే గ్రూపు రక్తం అవసరాల కోసం అభ్యర్థించగా పంపిణీ దశలో ఈ రెండు గ్రూపుల రక్తం తారుమారైంది. ఈ తప్పిదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్టాఫ్‌ నర్సు హుటాహుటిన మెడిసిన్‌ వార్డులో ఉన్న రోగికి మార్చడంతో అకస్మాత్తుగా మరణించినట్లు జిల్లా ప్రధాన వైద్యాధికారి  స్పష్టం చేశారు. ఈ తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్వచ్ఛందంగా స్పందించి  చొరవ తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement