బర్నాన యాదగిరి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ). శనివారం సాయంత్రం కొత్త బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తయింది. కార్యక్రమం పూర్తయ్యాక కొత్త ఆర్మీ ఆఫీసర్‌లంతా సంబరాల్లో మునిగిపోయారు. అందులో ఓ యువకుడు మాత్రం ప్రేక్షకుల్లో ఉన్న మామూలు దుస్తులు ధరించిన దంపతుల దగ్గరికెళ్లి నిలుచున్నాడు. మిలటరీ డ్రెస్సులో వచ్చిన యువకుడిని చూసి వారికి ఆనందం ఆగలేదు. అటు ఆ యువకుడి పరిస్థితీ అలాగే ఉంది. ఆ ముగ్గురూ ఆనందంగా హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. మొత్తం సంబరాల్లో వీరి వైపే అందరి దృష్టి మరలింది. ఆ యువకుడు తెలంగాణకు చెందిన బర్నాన యాదగిరి కాగా.. వారిద్దరూ అతని తల్లిదండ్రులు.
రూ.100 కూలీయే ఆధారం
బర్నాన గున్నయ్య హైదరాబాద్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ. రోజుకు సంపాదించే వంద రూపాయలే ఆ కుటుంబానికి ఆధారం. తల్లికి పోలియో. దీంతో ఈమె ఇంటికే పరిమితమయ్యారు. చిన్నప్పటినుంచీ చదువుల్లో ముందుండే యాదగిరి.. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. ఇదే సమయంలో ఓ అమెరికా కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నాడు. క్యాట్ పరీక్షలో 93.4శాతం స్కోరు సాధించటంతో ఐఐఎం ఇండోర్ నుంచి ఉన్నత విద్య అవకాశం తలుపులు తట్టింది. దీన్నీ తిరస్కరించాడు. పేదరికం వెక్కిరిస్తున్నా మాతృభూమికి సేవచేయాలనే లక్ష్యంతో ఐఎంఏ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. అంతేకాదు, ఐఎంఏ శిక్షణలోనూ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు’లో ప్రతిష్టాత్మక సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తమ కొడుకు ఆర్మీ ఆఫీసరన్న విషయం డెహ్రాడూన్‌కు వెళ్లేంతవరకూ ఆ తల్లిదండ్రులకు తెలియదు. ‘మా నాన్న రోజుకు రూ.60కే కూలీకి వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి. ఆర్థిక సమస్యలు డబ్బుకోసం ఆశపడలేదు. మాతృభూమికి సేవచేయటాన్ని మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది’ అని యాదగిరి ఉద్వేగంగా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment