►మెట్రోరైలు దిగి స్టేషన్ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ నుంచి ఓ సైకిల్ తీసుకుని ఇంటికి చేరుకోవడం, తర్వాత ఆ సైకిల్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే తిరిగి మెట్రోస్టేషన్ చేరుకోవడం.. వింతగా ఉంది కదా.
►ట్రాఫిక్‌లో ఇరుక్కున్న మన వాహనం ఉన్న ఫళంగా గాలిలోకి ఎగిరి ముందున్న వాహనాలను దాటుకుంటూ గాలిలో అలాఅలా తేలిపోతూ గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుంటుంది..
►గమ్యస్థానం ఫీడ్ చేస్తే చాలు.. డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు దానంతట అదే మనల్ని మనం చేరుకోవాల్సిన చోటుకు తీసుకెళుతుంది. ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదా..
కానీ ఈ ఊహలన్నీ హైదరాబాద్ ఐఐటీకి చెందిన ప్రత్యేక పరిశోధన విభాగం.. టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)) నిజం చేస్తోంది. కలలు సాకారం చేస్తోంది. మానవ ప్రమేయం లేకుండా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లే సైకిల్‌ను రూపొందించింది. రోడ్డుపై వెళుతూ అవసరమైతే గాల్లోకి ఎగిరిపోయే ప్యాసింజర్ కార్గో డ్రోన్ (కారు లాంటి వాహన)పై కూడా పరిశోధనలు చేస్తోంది.
రోడ్డు సౌకర్యం ఉండని కొండ ప్రాంతాలకు సరుకులు, అత్యవసరమైన మందులు చేరవేయడం వంటి అవసరాలకు వినియోగించే అటానమస్ డ్రోన్‌లపై పరిశోధన కొనసాగిస్తోంది. దీనికి రిమోట్ గానీ, ఆపరేటర్ గానీ అవసరం లేదు. గమ్యస్థానాన్ని ఫీడ్ చేస్తే అదే తీసుకెళుతుంది. అలాగే డ్రైవర్ అవసరం లేని అటానమస్ వాహనంపై కూడా ప్రయోగాలు చేస్తోంది.
ఇలాంటి వాటికెన్నిటికో కేంద్రంగా మారిన హైదరాబాద్ ఐఐటీలో మానవ రహిత వాహనాలపై పరిశోధనల్లో భాగంగా టిహాన్ ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌ను (డ్రైవర్ రహిత వాహనాలు ప్రయోగాత్మకంగా నడిపే రోడ్డు) కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్ రహిత వాహనాల్లో ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
నూతన ఆవిష్కరణలకు వేదిక
భవిష్యత్ సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్రసింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’పథకం కింద 25 టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్‌లను (సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రపంచంలో నాలుగో తరం నూతన ఆవిష్కరణలకు భారత్ వేదిౖకైందన్నారు. వ్యవసాయం, అత్యవసర రంగాల్లో ఇప్పటికే డ్రోన్‌లు వాడుతున్నారని, డ్రైవర్ లేకుండా అటానమస్ నావిగేషన్ ద్వారా వాటంతట అవే తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పరిశోధనలు జరిపిన హైదరాబాద్ ఐఐటీని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ పరిశోధనల్లో ముందు వరుసలో ఉందని చెప్పారు.
దేశంలోనే తొలి అటానమస్ వెహికల్ టెస్ట్‌బెడ్
హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ (ఏరియల్ అండ్ టెరస్ట్రియల్) దేశంలోనే మొదటిదని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ టెస్ట్‌బెడ్‌పై మానవ రహిత వాహనాల పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భారత దేశంలో ఉన్న పరిస్థితులు అంటే.. గ్రామీణ ప్రాంత రోడ్లు, మల్టీ లేన్‌లు, వర్షం పడుతున్నప్పుడు.. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఈ డ్రైవర్ రహిత వాహనాల పనితీరుపై పరీక్షలు చేస్తున్నామన్నారు.
మానవ రహిత ప్యాసింజర్ డ్రోన్‌లు సుమారు 1.50 క్వింటాళ్ల బరువున్న సరుకులను మోసుకెళ్లగలవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటీ పాలకమండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీఐహెచ్‌ఏఎన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
– సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment