బాక్సర్‌లా బరిలో దిగుతా! | I am not a rubber stamp CM: Jitan Ram Manjhi | Sakshi
Sakshi News home page

బాక్సర్‌లా బరిలో దిగుతా!

Published Sat, Feb 14 2015 5:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

బాక్సర్‌లా బరిలో దిగుతా!

బాక్సర్‌లా బరిలో దిగుతా!

 

  • విశ్వాస పరీక్షపై మాంఝీ వ్యాఖ్య

పట్నా: గెలుపోటముల గురించి ఆలోచించకుండా ఒక మల్లయోధుడిలా విశ్వాస పరీక్ష అనే బరిలోకి దిగుతానని బిహార్ సీఎం జితన్ రావూంఝీ శుక్రవారం అన్నారు. ‘ప్రత్యర్థి ఎంత బలమైన వాడనే విషయాన్ని కానీ, గెలుపోటముల గురించి కానీ పట్టించుకోకుండా కుస్తీ పోటీలకు దిగే పహిల్వాన్‌లా బరిలో దిగుతాను. బడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాడతానని అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేస్తాను. నాతో ఏకీభవించేవారు కలసి రావాలంటాను. సరైన స్పందన రాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తాను’ అని స్పష్టం చేశారు. ఒక్క బీజేపీ అనే కాకుండా, అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు కోరతానన్నారు.

కీలుబొమ్మలా వ్యవహరిస్తానని, చెప్పినట్లు వింటానని భావించి తనను వారసుడిగా ఎంచుకోవడం నితీశ్ చేసిన అతిపెద్ద పొరపాటు అని అన్నారు. ‘సీఎం అయిన మొదటి 2 నెలలు కీలుబొమ్మలానే వ్యవహరించాను.  నా ఆత్మగౌరవం నన్ను ప్రశ్నించడం ప్రారంభించిన తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించాను’ అన్నారు. కాగా, విశ్వాస పరీక్ష ముందు మాంఝీ తన మద్దతుదారైన రాజీవ్ రంజన్‌ను చీఫ్ విప్‌గా నియమించడం మరో వివాదానికి దారి తీసింది. ఆ చర్య నిబంధనలకు వ్యతిరేకమని ప్రస్తుత చీఫ్ విప్, నితీశ్ మద్దతుదారైన శ్రవణ్ పేర్కొంటుండగా, సభా నేతగా మాంఝీకి ఆ అధికారం ఉందని రాజీవ్ రంజన్ వాదిస్తున్నారు.

రాజీవ్ రంజన్‌ను చీఫ్‌విప్‌గా నియమించాలని కోరుతూ మాంఝీ రాసిన లేఖపై స్పీకర్ ఇంతవరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. కాగా, జేడీయూని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు విజయ్ కుమార్ చౌధరి స్పీకర్‌కు రాశారు. మాంఝీని బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని, ఏ పార్టీకీ చెందని సీఎంగా ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారని, ఈ విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా తాము ఓటేయాలనుకుంటున్న దృష్ట్యా తమకు ప్రధాన విపక్ష హోదా ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement