మోడీతో మాట్లాడతా! | i will talk to modi about on railway charges | Sakshi
Sakshi News home page

మోడీతో మాట్లాడతా!

Published Sun, Jun 22 2014 10:22 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీతో మాట్లాడతా! - Sakshi

మోడీతో మాట్లాడతా!

సాక్షి, ముంబై: రైల్వే చార్జీలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కూటమిలోని భాగస్వాముల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన శివసేన రైల్వే చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పేదల జేబులను కొల్లగొట్టే చార్జీల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం డిమాండ్ చేశారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టడం ఎప్పుడూ జరిగేదే. అయితే ప్రతిపక్షాల ఆందోళనకు మద్దతు పలుకుతూ అధికారపక్ష వైఖరిని భాగస్వామ్య పార్టీ కూడా తప్పుబడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
ఈ విషయమై ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడుతూ... పేదల ఆర్థిక బడ్జెట్ పూర్తిగా తలకిందులయ్యే విధంగా ఉందని, పెంపును వెంటనే రద్దుచేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఢిల్లీలో శివసేనకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు శివసేన వైఖరిని కేంద్రానికి తెలియజేస్తారని చెప్పారు. త్వరలో తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ విషయంపై మాడ్లాడతానన్నారు. ‘ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పేదలతోపాటు మధ్య తరగతి ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే జీతం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి.
 
దీంతో కుటుంబాన్ని పోషించేం దుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితిలో రైలు చార్జీలు పెంచి వారిపై మరింత ఆర్థిక భారాన్ని మోపడం సబబు కాద’ని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ముందు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ తర్వాతే చార్జీల పెంపుపై ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి ప్రయాణ చార్జీలతోపాటు, సరుకు రవాణ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ముంబైలోని లోకల్ రైళ్ల ప్రయాణించే 75 లక్షల మందిపై పడనుంది. చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement