ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన ఠాక్రే
- రాష్ట్రాల స్వతంత్రాన్ని హరిస్తున్నారంటూ మండిపాటు
ముంబై: బీజేపీ మిత్రపక్షమైన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ రాష్ట్రాల స్వాతంత్రాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు. 'అచ్చెదిన్ వాణిజ్య ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అన్ని వ్యవహారాలు ప్రధాని ఇష్టానుసారం సాగితే.. ఇక మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టా? ఆయన అధికారాలన్నింటినీ విభజించడానికి బదులు కేంద్రం వద్ద కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ట్రాల స్వతంత్రాన్ని హరిస్తున్నారు' అని పార్టీ అధికార పత్రిక 'సామ్నా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విమర్శించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో రాంనాథ్ కోవింద్ అలవోకగా విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీపై ఆయన ఈవిధంగా మండిపడటం గమనార్హం. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలతోపాటు క్రాస్ ఓటింగ్ జరిగి కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి కూడా ఓట్లు పడ్డట్టు వెల్లడైన నేపథ్యంలో మోదీపై ఠాక్రే ఈవిధంగా విమర్శలు ఎక్కుపెట్టారు.