
బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని
నేను బంధీని కావాలనుకోవటం లేదు. నా స్వేచ్ఛ అంతటితో ముగిసిపోతుంది...
జైపూర్ : తాను కోరుకుంటే నిమిషంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. గురువారం రాజస్తాన్‌లోని బాన్స్‌వారాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె ఈ మాటలన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను బంధీని కావాలనుకోవటం లేదు. నా స్వేచ్ఛ అంతటితో ముగిసిపోతుంది. ఒక వేళ ముఖ్యమంత్రి అయ్యేఅవకాశం నన్ను వెతుకుంటూ వస్తే తప్పకుండా అవుతాను. ఇప్పుడైతే ఆ ఉద్ధేశం లేద’ని అన్నారామె.
హేమమాలిని సినిమాలకు కొద్దిగా దూరమైన తర్వాత రాజకీయాలలో బిజీ అయ్యారు. 1999లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు. 2014లో బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె తన ప్రత్యర్థి జయంత్ చౌదరిపై అత్యథిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.