‘ముఖ్యమంత్రి అవ్వడం అనేది నాకు నిమిషాల మీద పని. నేను తల్చుకుంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కాగలను’ అంటున్నారు బాలీవుడ్ ‘డ్రీమ్ గర్ల్’ హేమ మాలిని. బుధవారం రాజస్థాన్ బన్స్వారాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి హాజయరయ్యారు హేమ మాలిని. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో విలేకరులు ‘ఒక వేళ అవకాశం వస్తే మీరు యూపీ సీఎం అవుతారా’ అని అడగ్గా.. అందుకు హేమ మాలిని ‘నేను తల్చుకుంటే సీఎం అవ్వడం పెద్ద విషయమేం కాదు. కానీ నాకు అది ఇష్టం లేదు. సీఎం అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సమయాన్ని కోల్పొవాల్సి వస్తుందంటూ’ బదులిచ్చారు.
అంతేకాక ‘నేను మంత్రిని అవ్వడానికి కారణం నా సినీ జీవితం. ప్రజలు నన్ను హేమ మాలిని, ‘డ్రీమ్ గర్ల్’ అని పిలుస్తారు. నేను బాలీవుడ్‌లో పనిచేశాను. అందువల్లే నన్ను అందరూ గుర్తించగల్గుతారని’ తెలిపారు. అంతేకాక ‘పార్లమెంట్‌లో ప్రవేశించకముందే నేను బీజేపీ కోసం చాలా పని చేశాను. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ నాలుగేళ్లలో నా నియోజకవర్గం మధురలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యంగా ఇక్కడ రహదారుల అభివృద్ధికి అధికంగా కృషి చేశానని’ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అభినందనలతో ముంచెత్తారు. ‘మోదీ లాంటి ప్రధాని లభించడం చాలా అరుదు. ప్రతిపక్షాలు ఆయన గురించి ఏవేవో మాట్లాడుతుంటాయి. కానీ దేశం కోసం పని చేస్తున్నదేవరో ప్రత్యక్షంగా చుస్తూనే ఉన్నాం కదా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment