బీఎస్సీ ఇన్‌ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్‌ను దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టిన ఐఐటీ మద్రాస్.. కోర్సులో ఎన్నెన్నో ప్రత్యేకతలు
సాక్షి, హైదరాబాద్: సర్టిఫికెట్ కోర్సుకు 3 – 4 నెలలు.. డిప్లొమా అంటే ఏడాది.. డిగ్రీ చదవాలంటే మూడేళ్లు! ఇదీ ప్రస్తుత విధానం. ఇకపై మాత్రం కాదు. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా ఐఐటీ మద్రాస్ మంగళవారం ఆన్‌లైన్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆన్‌లైన్‌లో ఈ కోర్సును ప్రారంభించారు. ‘బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్’ అనే ఈ కోర్సుకు బోలెడు ప్రత్యేకతలున్నాయి.
ఇంటర్మీడియెట్ పాసైతే చాలు ఈ కోర్సులో చేరి పోవచ్చు. అంతేకాదు.. ఇతర కోర్సులు చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లూ చేరవచ్చు. ఒకసారి చేరితే మూడేళ్లపాటు డిగ్రీ చదివి తీరాలనే నిబంధనేదీ లేదు. కొన్ని నెలలు, కొన్ని అంశాలను చదవకుంటే సర్టిఫికెట్ కోర్సుగా, మరింత కాలం అదనపు సబ్జెక్టులను కలుపుకుని చదివితే డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లు అందించటం ఈ కోర్సు ప్రత్యేకత.
ఐటీ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు రూపొందిన ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాక, వృత్తి నైపుణ్యాలను పెంచు కోవాలనుకునే ఐటీ ఉద్యోగులకూ ఉప యోగపడుతుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు.మేధోవలసను ఆపాలి: కేంద్ర మంత్రి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఢిల్లీ నుంచి ఈ ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థులు ఏటా ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఐఐటీలాంటి సంస్థలు ఈ మేధోవలసకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఐఐటీ మద్రాస్ సిద్ధంచేసిన బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్ ఇందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు ప్రతాప్ హరిదాస్, ఆండ్రూ తంగరాజ్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పవన్‌కుమార్ గోయంకా పాల్గొన్నారు. ఏటా జనవరి, మే, సెప్టెంబర్‌లో విద్యార్థులను చేర్చుకుంటారు. వారానికి 2 – 3 గంటల వీడియో పాఠాలు, క్విజ్‌లు.. దగ్గరలోని సెంటర్ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. క్వాలిఫయర్ పరీక్ష సాయంతో కోర్సులోకి ఎవరు చేరవచ్చో నిర్ణయిస్తారు. ఫౌండేషన్ సర్టిఫికెట్ కోర్సులో గణితం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక పాఠాలు వంటి ఎనిమిది కోర్సులుంటాయి.
ఈ 8 సబ్జెక్టులను పూర్తిచేసి కోర్సు వదిలేయాలనుకునే వారికి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కొనసాగిస్తే.. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లలో డిప్లొమా చేయవచ్చు. కంపెనీల్లో పనిచేస్తూ నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వారు నేరుగా డిప్లోమా కోర్సులో చేరవచ్చు. వారానికి పది గంటల చొప్పున ఆన్‌లైన్ పాఠాలు, పరీక్షలుంటాయి. ఏడాది నుంచి రెండేళ్లలో ఈ దశను పూర్తిచేసిన వారికి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ సబ్జెక్టుల్లో విడివిడిగా డిప్లొమా అందిస్తారు. రెండు సబ్జెక్టుల్లోనూ డిప్లొమా అందుకునే అవకాశమూ ఉంది. డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనునుకునే వారు కోర్సును కొనసాగించవచ్చు కూడా.
చివరగా డిగ్రీ కోర్సు పూర్తికి మూడు నుంచి ఆరేళ్లు పడుతుంది. తొలి రెండు దశలు పూర్తిచేసిన వారు లేదా నేరుగా డిప్లొమా కోర్సులో చేరి పూర్తిచేసిన వారు డిగ్రీ కోర్సు పూర్తి చేసేందుకు అర్హులు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు ఆప్షన్లలో రెండింటిని ఎంచుకుని కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫౌండేషన్ కోర్సుకైతే రూ.32 వేలు, డిప్లొమా కోర్సుకు రూ.1.10 లక్షలు, డిగ్రీ కోర్సుకు రూ.లక్ష ఫీజు. అంటే, ఇంటర్మీడియట్ తరువాత బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్ డిగ్రీ కోర్సు పూర్తికి రూ.2.42 లక్షలు ఖర్చవుతాయన్నమాట.
వివరాలకు వెబ్‌సైట్: onlinedegree. iitm. ac. in
Comments
Please login to add a commentAdd a comment