
సాక్షి, చెన్నై : డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి శుభవార్త. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చినప్పడు డయాబెటిస్‌తో బాధపడే వారిలో గాయాలు అంత తొందరగా మానవు. ఒక్కోసారి దీర్ఘకాలిక గాయాలు పెను ప్రమాదానికి కూడా దారి తీసే అవకాశం లేకపోలేదు. వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెందినా.. ఈ విషయంలో అనుకున్న ప్రగతి సాధించలేకపోయింది. తాజాగా ఐఐటీ మద్రాస్‌కు చెందిన విద్యార్థులు దీనికి పరిష్కారానికి కనుగొన్నారు. డయాబెటిస్ పేషెంట్లకు అయిన గాయాలు త్వరగా నయం అయ్యేట్లు ప్రత్యేక డ్రెసింగ్ విధానాన్ని రూపొందించారు.
గాయం ఏర్పడిన ప్రాంతంలో కొత్త కణాలు త్వరగా ఉత్పత్తి కావడానికి గ్రాఫిన్ ఆధారిత డ్రెసింగ్ విధానాన్ని కనుగొన్నారు. త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఐఐటీ మద్రాస్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ విగ్నేష్ ముత్తు విజయన్ తెలిపారు. ‘సైలియం, గ్రాఫిన్ ఆక్సైడ్ నానో కంపోజిట్ మంచి ఫలితాలు ఇచ్చాయి. గ్రాఫిన్ ఆధారంగా అతి తక్కువ ధరలో ట్రీట్‌మెంట్ అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. సాధారణ వ్యక్తులకు గాయాలైనప్పుడు ఈ డ్రెసింగ్ విధానాన్ని ఉపయోగిస్తే 23 రోజుల్లో నయం కావాల్సిన గాయం.. కేవలం 16 రోజుల్లో నయమవుతుంది. అలాగే డయాబెటిస్ పెషెంట్లలో 26 రోజుల్లో నయమయ్యే గాయం 20 రోజుల్లోనే తగ్గిపోతుంది’ అని ఆయన వెల్లడించారు. డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నవారికి ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment