
ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసు సీబీఐకి బదలాయింపు..
సాక్షి, చెన్నై : ఐఐటీ మద్రాస్ విద్యార్ధిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. తమ కుమార్తె ఆత్మహత్య కేసును సీబీఐకి నివేదించాలని ఫాతిమా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తు సంస్థకు కేసును బదలాయించింది. నవంబర్ 8న ఐఐటీ మద్రాస్‌లో హ్యుమనిటీస్ విద్యార్ధిని ఫాతిమా (19) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతోనే కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆశించిన మార్కులు రాకపోవడంతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ నిత్యం వేధిస్తుండటంతోనే తమ కుమార్తె మరణించిందని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్‌లోనూ ఇదే విషయం ఫాతిమా ప్రస్తావించిందని చెబుతున్నారు. ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తమ కుమార్తెను మతపరమైన వివక్షకు గురిచేశారని ఆమె తండ్రి ఆరోపించారు.