
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నగదు, అక్రమ ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 142 కోట్ల నగదు, 975 అక్రమ ఆయుధాలను సీజ్ చేశామని అదనపు ఎన్నికల ప్రధానాధికారి దిలీప్ షిండే వెల్లడించారు. సెప్టెంబర్ 21న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం పెద్ద ఎత్తున నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం శనివారంతో ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో ఈనెల 21న పోలింగ్ జరగనుండగా, 24న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా మరోసారి పాలనాపగ్గాలు చేపట్టాలని కాషాయ పార్టీ చెమటోడుస్తుండగా, ఈ రాష్ట్రాల్లో పాగా వేయాలని విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.