
న్యూఢిల్లీ: మెరుగైన రుణ పరపతి, మార్కెటింగ్ సౌకర్యాలు సులువుగా అందుబాటులోకి వస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం’పై నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. వ్యవసాయ అభివృద్ధికి నిపుణులు చేసిన సిఫార్సులను పరిశీలిస్తామని, నీతి ఆయోగ్ ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని తెలిపారు.
వ్యవసాయ మార్కెటింగ్‌ను ఉమ్మడి జాబితాలో చేర్చడం, భూమి పట్టాల డిజిటలైజేషన్, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారైన వస్తువులపై జీఎస్టీ తగ్గింపు, గ్రామీణ వాణిజ్య కేంద్రాల ఏర్పాటు లాంటివి ఈ సదస్సులో తెరమీదికి వచ్చిన కొన్ని సూచనలు.
2.3కోట్ల టన్నులు పెరిగిన పప్పు దినుసుల రాబడి
వ్యవసాయ పరపతి సదుపాయాన్ని రూ.8 లక్షల కోట్ల నుంచి రూ. 11 లక్షల కోట్లకు పెంచినట్లు మోదీ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధికి ప్రకటించిన చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఏడాది కాలంలోనే దేశంలో పప్పు దినుసుల ఉత్పత్తి 1.7 కోట్ల టన్నుల నుంచి 2.3 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు.
యూరియాకు వేప పూత కోటింగ్ వల్ల ఎరువు సామర్థ్యం పెరిగిందని తెలిపారు. భూసార కార్డులతో రసాయన ఎరువుల వాడకం 8–10 శాతం తగ్గిందన్న ప్రధాని..పంట ఉత్పత్తి 5–6 శాతం పెరిగిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment