ఇస్లామాబాద్ : శాంతి ప్రక్రియ కోసం తాను చేసిన ప్రతిపాదనలపై భారత్ స్పందించడం లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే అది ఆత్మహత్యాసదృశ్యమేనని హెచ్చరించారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రయోజనాలకు కోల్డ్ వార్ సైతం వాంఛనీయం కాదని టర్కీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చర్చల ప్రతిపాదనను భారత్ పలుమార్లు తోసిపుచ్చిందన్నారు. కశ్మీరీ ప్రజల హక్కులను భారత్ ఎన్నడూ అణిచివేయలేదన్నారు. కాగా 2016లో భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిపిన దాడి దరిమిలా పాక్ భూభాగంలో భారత్ మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment