మాజీ సీఎం కుటుంబానికి జప్తు ఉత్తర్వులు
న్యూఢిల్లీ : బినామీ ఆస్తుల వ్యవహారంలో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబానికి చివరి జప్తు ఉత్తర్వులు జారీచేసినట్లు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తెలిపింది. ఏబీ ఎక్స్‌పోర్ట్ ప్రైవేటు లిమిటెడ్‌కు దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఓ స్థలానికి సంబంధించి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లోనే తాము జప్తు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కోర్టు ఆమోదంతో ప్రస్తుతం తుది ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
బినామీ వ్యవహారాల(నిరోధక) చట్టం–2016 ప్రకారం ఇప్పటికే లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ, కుమార్తెలు చందా, రాగిణి, మీసా భారతీ, అల్లుడు శైలేశ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దేశ రాజధానితో పాటు బిహార్‌లో 12 విలువైన బినామీ ఆస్తుల్ని తాము జప్తు చేసినట్లు వెల్లడించారు. ఈ బినామీ ఆస్తుల ఒప్పంద విలువ రూ.9.32 కోట్లే ఉన్నప్పటికీ మార్కెట్ విలువ రూ.170–180 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఐటీశాఖ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమని లాలూ కుటుంబం ఆరోపించింది.