బహిరంగ చర్చకు సిద్ధమా?: నరేంద్రమోడీ
అహ్మదాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. దేశభద్రత విషయంలో ప్రధాని చేతులు ముడుచుకొని చోద్యం చూస్తున్నారని, సరిహద్దుల వెంట పాకిస్థాన్, చైనా తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అందుకు దీటుగా స్పందించడం లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి, పాలన అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరారు. గురువారం గుజరాత్‌లోని భుజ్‌లో ఓ కాలేజీలో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో మోడీ ప్రసంగించారు. దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి నుంచి ఆహార భద్రత బిల్లు వరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. పంద్రాగస్టు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశభద్రతపై ఆందోళన వ్యక్తంచేసిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు. ‘‘సహనానికి ఓ హద్దు ఉంటుందని రాష్ట్రపతి చెప్పారు. ఆ హద్దు ఏమిటి.. ఎక్కడుందో నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ సహనం ఎంతకాలం ఉంటుంది? ఈరోజు దేశభద్రత ముప్పు ముంగిట ఉంది. పాకిస్థానే కాదు.. చైనా కూడా మన సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తోంది.
అయినా మనం మౌనంగానే ఉంటున్నాం. ఇటలీ సైనికులు మన జాలర్లను చంపేసినా.. పాకిస్థానీయులు మన జవాన్ల తలలను నరికివేసినా మౌనంగానే ఉంటున్నాం..’’ అని అన్నారు. ప్రధాని మన్మోహన్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఎక్కడా పాక్‌ను హెచ్చరించలేదన్నారు. ‘‘అంతర్జాతీయ సంబంధాలు, పొరుగు దేశాలతో స్నేహ బంధం వంటి అంశాల్లో ప్రధాని సంయమనం పాటించాలన్న విషయం నాకు తెలుసు. పాక్‌కు సవాలు విసిరేందుకు ఎర్రకోట వేదిక కాదని కూడా తెలుసు. కానీ భారత ఆర్మీ మనోస్థైర్యాన్ని నిలబెట్టాల్సిన వేదిక మాత్రం కచ్చితంగా అదే. ప్రధాని మన జవాన్లలో ధైర్యం పెంచుతారని ఆశించా. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు’’ అని విమర్శించారు. ‘ఎర్రకోటపై ఎక్కువసార్లు జెండా ఎగరవేసినవారి జాబితాలో మీరు (ప్రధాని) ఉన్నట్లు విన్నాను. పండిట్ నెహ్రూ జాతినుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ఏమి చెప్పారో మీరు ఇప్పటికే అవే విషయాలను చెబుతున్నారు. ఆనాడు ఆయన ఏ సమస్యలను పేర్కొన్నారో వాటినే మీరు మళ్లీ ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ 60 ఏళ్లు మీరేం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి?’ అంటూ మోడీ ఎద్దేవా చేశారు. కాగా, చర్చకు రావాల్సిందిగాప్రధానికి సవాలు విసిరిన మోడీపై కాంగ్రెస్ మండిపడింది. ఆయన చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. ‘ప్రధాని చివరగా వస్తారు. ముందు మాతో చర్చకు సిద్ధపడు’ అని కేంద్ర మంత్రి ఖుర్షీద్ అన్నారు.
వ్యక్తిగత విమర్శలు సరికాదు: అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ ప్రసంగంపై గుజరాత్ సీఎం మోడీ చేసిన విమర్శల తీరు బీజేపీ అగ్రనేత అద్వానీకి నచ్చలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఈ రోజున వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును పురస్కరించుకుని దేశం సంబరాలు జరుపుకొంటున్న సందర్భంలో ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయకూడదని, ప్రధాని మన్మోహన్‌పై, ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయకూడదని మోడీ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగంపై మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు.