జర్మనీలోని ప్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై నిలిచిపోయిన విమానాలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్) విజృంభిస్తుండటంతో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు సోమవారం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మార్చి 18న అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందని సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం నుంచి దేశ అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అన్ని రకాల ప్రయాణికుల రాకపోకలను నిషేధించారు. దేశం మొత్తమ్మీద వైరస్ నియంత్రణ చర్యల పుణ్యమా అని అధికశాతం విద్యార్థులకు ఇళ్లకు పరిమితమైపోగా, ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసే పరిస్థితి ఏర్పడింది. జిమ్‌లు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూసేశారు.
కొత్త టోల్‌ఫ్రీ నంబర్
వైరస్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కేంద్రం సోమవారం నుంచి కొత్త టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ఉన్న 011– 23978046తోపాటు 1075 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ncov2019 @gmail. comకు ఈ మెయిల్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. (కరోనా బారిన పడ్డాను)
నవోదయకు ముందుగానే సెలవులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని 600 జవహర్ నవోదయ విద్యాలయాలకు ముందుగానే సెలవులు ప్రకటించనున్నారు. పరీక్షలు అయిపోతున్న నేపథ్యంలో వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నామని మార్చి 21 నుంచి మే 25 వరకూ సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఒడిశాలో తొలి కేసు
భారతదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి మార్చి 6న ఢిల్లీకి వచ్చి ఆ తరువాత రైలు మార్గం ద్వారా మార్చి 12న భువనేశ్వర్‌కు వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. లదాఖ్, కశ్మీర్, కేరళల్లో నమోదైన ఒక్కో కేసును పరిగణనలోకి తీసుకుంటే దేశం మొత్తమ్మీద సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి కారణంగా మరణించిన ఇద్దరితోపాటు 17 మంది విదేశీయులు, చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు ఈ 114 మందిలో ఉన్నారు. ముంబైలో నలుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడటంతో మహారాష్ట్రలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 37కు చేరుకుంది.
దేవాలయాలకు తాళాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాలు, ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ఒస్మానాబాద్‌లోని తుల్జా భవానీ ఆలయాలను మూసివేయనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. సిద్ధి వినాయక ఆలయం తదుపరి ఉత్తర్వుల వరకూ మూతపడగా.. తుల్జాభవానీ ఆలయం మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ మూతపడనుంది. సామూహిక సమావేశాలను నివారించాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిద్ధివినాయక ఆలయం ట్రస్టు చైర్మన్ అదేశ్ భండేకర్ తెలిపారు.
శక్తివంచన లేకుండా కృషి: మోదీ
వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాప్తి నిరోధాల విషయంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. (కరోనా మరణాలు @ 7007)
పరిష్కారాలు సూచించండి
వైరస్ నియంత్రణకు mygov. in వెబ్‌సైట్‌లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు సూచించాల్సిందిగా దేశ ప్రధాని మోదీ కోరారు. వ్యాధిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు పౌరులకు తగిన సమాచారం అందడం చాలా ముఖ్యం. కొంతమంది వ్యక్తులు, కంపెనీలు బయో ఇన్ఫర్మాటిక్స్, డేటాసెట్స్, వ్యాధి నిర్ధారణకు అప్లికేషన్ వంటివి అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ పరీక్షలు షురూ
వాషింగ్టన్: ప్రాణాంతక కోవిడ్‌కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్‌కు ప్రయోగాత్మక టీకా వేశారు. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు చెప్పారు. సియాటెల్‌లోని కైసర్ పెర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్‌ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. తీవ్రమైన దుష్ప్రభావాలేవీ లేనట్టు నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నామని, ఇందులో వైరస్ ఏదీ లేని కారణంగా టీకా తీసుకున్న వ్యక్తికి కోవిడ్ సోకే అవకాశమూ లేదని వివరించారు.
సియెటెల్‌లో టీకా వేస్తున్న దృశ్యం
అమెరికా, జర్మనీ మాటల యుద్ధం
క్యూర్‌వ్యాక్ అనే కంపెనీ తయారు చేస్తున్న కరోనా నిరోధక టీకా ఒకటి అమెరికా, జర్మనీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకాపై తాము హక్కులు కొనుక్కుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై జర్మన్లు విరుచుకుపడుతున్నారు. జర్మనీ అమ్మకానికి లేదని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి పీటర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైవెల్ట్ అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. క్యూర్‌వ్యాక్ అభివృద్ధి చేస్తున్న టీకాపై హక్కుల కోసం అమెరికా 100 కోట్ల డాలర్లు ఇవ్వచూపింది. ఆ టీకా అమెరికాలో వాడాలన్నది షరతు. మరోవైపు, క్యూర్‌వ్యాక్‌లో పెట్టుబడులు పెట్టిన వారు మాట్లాడుతూ ఏ ఒక్క ప్రభుత్వానికో తాము టీకా అమ్మబోమని స్పష్టం చేశారు. సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తే అది ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు డైట్ హాప్ అనే పెట్టుబడిదారు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment