కారు డీలర్‌షిప్ యజమాని ఇబ్రహీం ఉన్వర్డి (ఫైల ఫోటో)
ఇస్తాంబుల్: బాస్ మీద కోపంతో ఓ ఉద్యోగి కోవిడ్ రోగి లాలాజలంతో తన బాస్‌ని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి కారు డీలర్‌షిప్ యజమానిగా పని చేస్తున్నాడు. రంజాన్ సిమెన్ అనే వ్యక్తి మూడేళ్లుగా అతడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. చెప్పిన పని చేస్తూ.. నమ్మకంగా ఉండటంతో ఇబ్రహీం అప్పుడప్పుడు రంజాన్ చేతికి డబ్బులు కూడా ఇచ్చే వాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇబ్రహీం కారు అమ్మగా వచ్చిన 2,15,000టర్కిష్ లిరాలను(2,22,2160 రూపాయలు) రంజాన్ సిమెన్‌కి ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫీసులో జమ చేయాల్సిందిగా కోరాడు.
అయితే ఇంత పెద్ద మొత్తం చేతికి రావడంతో రంజాన్ మనసులో చెడు ఆలోచనలు ప్రవేశించాయి. పైగా అప్పటికే అతడు లోన్ బకాయి ఉన్నాడు. ఈ క్రమంలో ఇబ్రహీం ఇచ్చిన డబ్బు తీసుకుని ఉడాయించాడు రంజాన్. దాంతో ఇబ్రహీం అతడి మీద పోలీసులకు ఫిర్యాడు చేయడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అప్పటి నుంచి రంజాన్ బాస్ మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలని భావించాడు. ఈ క్రమంలో ఓ దారుణమైన ఆలోచన చేశాడు. బాస్, అతడి కుటుంబ సభ్యులు తాగే డ్రింక్స్‌లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి లాలాజలాన్ని కలిపి అందరిని ఒకేసారి చంపాలని భావించాడు. ఇందుకు గాను ఓ కరోనా రోగికి 50 టర్కిష్ లిరాలు (రూ. 516)చెల్లించి అతడి లాలాజలాన్ని కొన్నాడు.
అయితే ఇబ్రహీం అదృష్టం కొద్ది రంజాన్ చేస్తోన్న దారుణం గురించి అతడికి ముందే తెలిసింది. రంజాన్ సహోద్యోగి ఒకరు దీని గురించి బాస్‌కు తెలపడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలు సమర్పించాడు. దాంతో పోలీసులు రంజాన్ మీద హత్యానేరం కేసు నమోదు చేశారు. అయితే ఇంత జరిగినా రంజాన్ మాత్రం మారలేదు. ‘‘నేను నిన్ను వైరస్‌తో చంపడం కాదు.. ఈ సారి నీ పుర్రెని పుచ్చకాయాల పేల్చేస్తాను’’ అంటూ బాస్‌కి బెదిరింపు సందేశాలు పంపుతున్నాడట. ఇబ్రహీం దీని గురించి మాట్లాడుతూ.. ‘‘రంజాన్‌ను చూస్తే.. భయం వేస్తుంది. ప్రస్తుతం నేను, నా భార్య, పిల్లలు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. మా సొంత ఇంట్లోనే మేం బందీలుగా బతుకుతున్నాం. ఇలా ఇంకేన్నాళ్లో’’ అంటూ వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment