ఇస్తాంబుల్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వేళ టర్కీలో అద్భుతం చోటుచేసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన 93 ఏళ్ల వృద్ధురాలు కోలుకుని ఆశాదీపంగా నిలిచారు. ఇస్తాంబుల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. కేవలం 10 రోజుల్లోనే మహమ్మారి కోరల నుంచి బయటపడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య లక్ష దాటిన విషయం తెలిసిందే. ఇక టర్కీలోనూ ఈ అంటువ్యాధి ప్రబలుతూ ఆందోళనలు రేకెత్తిస్తోంది. మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్న మొదటి పది దేశాల జాబితాలో టర్కీ ఒకటి. ఇప్పటి వరకు అక్కడ వెయ్యికి పైగా కరోనా మరణాలు చోటుచేసుకోగా.. దాదాపు 47 వేల మందికి వైరస్ సోకింది.(కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి)
ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం బ్యాట్‌మన్ సిటీకి చెందిన మహిళా రైతు అలే గుండుజ్‌లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో మార్చి 31న ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హైపర్‌టెన్షన్, వయోభారంతో బాధ పడుతున్న గుండుజ్‌కు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో మరో మారు కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో శుక్రవారం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది చప్పట్లు కొడుతూ ఆమెను ఇంటికి పంపించారు. మనుమడు వెంటరాగా ఆస్పత్రిని వీడిన గుండుజ్... ‘‘అందరూ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’అంటూ ఇంటికి బయల్దేరారు.(కరోనా: మరణం అంచుల నుంచి వెనక్కి వృద్ధులు!)
ఈ విషయం గురించి ఆస్పత్రి చీఫ్ ఫిజీషియన్ జకాయీ కుట్లుబే మాట్లాడుతూ.. ‘‘93 ఏళ్ల మహిళ ఇంటెన్సివ్ కేర్ నుంచి ఆరోగ్యంగా బయటకు నడిచారు. వృద్ధులపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటోందన్న తరుణంలో ఆమె మాలో కొత్త ఆశలు రేకెత్తించారు. దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నా 10 రోజుల్లోనే వైరస్ బారి నుంచి కోలుకున్నారు’’అని హర్షం వ్యక్తం చేశారు. కాగా 15 మిలియన్ మంది జనాభా కలిగి ఉన్న ఇస్తాంబుల్‌లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60 శాతం మంది ఇస్తాంబుల్‌కు చెందినవారే గమనార్హం. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది.. ఆస్పత్రులు యుద్ధక్షేత్రాన్ని తలపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, నర్సుల మానవతా దృక్పథంతో కఠిన శ్రమకోర్చి వేలాది మందిని కాపాడుతున్నారని పేర్కొన్నారు. అయితే గుండుజ్ లాంటి వాళ్లు కోలుకుని తమలో సానుకూల దృక్పథాన్ని మరింతగా పెంపొందిస్తున్నారన్నారు.(కరోనాతో హాలీవుడ్ నటి మృతి)
Comments
Please login to add a commentAdd a comment