ఢిల్లీ: భారత్‌లో దశాబ్ద కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బహుపార్శ్వపు పేదరిక సూచిక (మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ – ఎంపీఐ) వెల్లడించింది. యూఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ కలసి రూపొందించిన ఈ సూచిక తాలూకూ నివేదిక ప్రకారం – మన దేశం వేగంగా పేదరికాన్ని తగ్గించగలుగుతోంది. జార్ఖండ్ వేగవంతమైన అభివృద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో పదేళ్ల(2005–6, 2015–16)కాలంలో పేదరికం 46.5 శాతం మేరకు తగ్గింది. ఇండియా, ఇథియోపియా, పెరూ దేశాలు పేదరికాన్ని తగ్గించడంలో చెప్పుకోదగిన రీతిలో ముందున్నాయి. 101 దేశాల సూచికలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో 31 స్వల్పాదాయ దేశాలు, 68 మధ్యాదాయ దేశాలు. ఆయా దేశాల్లో 130 కోట్ల మంది బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. పేదరికాన్ని, అది ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలనేది ఐక్య రాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది. నివేదిక ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 200 కోట్ల జనాభా గల 10 దేశాలు (భారత్, బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతి, నైజీరియా, పాకిస్తాన్, పెరు, వియత్నాం) దశాబ్ది కాలంలో ఈ లక్ష్య సాధన దిశగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయని వెల్లడించింది. పై పది దేశాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు మరింత పేదరికం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment