న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6,088 కరోనా కేసులు శుక్రవారం నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 1,18,447గా ఉంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 66,330 కాగా, 48,534 మంది కోలుకున్నారు. కోవిడ్–19తో ఇప్పటివరకు 3,583 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 148 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ ర్యాంక్ అధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. కాగా, కోవిడ్–19 విధుల అనంతరం వైద్య సిబ్బందికి క్వారంటైన్ అవసరం లేదని ఆరోగ్య శాఖ ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీలోని వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
వేలాది ప్రాణాలు నిలిచాయి
దేశవ్యాప్త లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల 14 లక్షల నుంచి 29 లక్షల వరకు కేసులను నిరోధించగలిగామని, 78 వేల ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొంది. ఈ విషయాలు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయని కోవిడ్‌పై ఏర్పాటు చేసిన సాధికార బృందం–1 చైర్మన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. కేసులు రెట్టింపు అయ్యే సమయం కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సమయలో 3.4 రోజులుండగా, ఇప్పుడు 13.3 రోజులకు పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కొద్ది ప్రాంతాలకే పరిమితమయిందని, 80% యాక్టివ్ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వివరించారు. ఇప్పటివరకు 48,534 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం వెల్లడించారు. మొత్తం కేసుల్లో ఇది 41% అన్నారు.
కరోనాను జయించిన వృద్ధురాలు
ఇండోర్‌కు చెందిన ఒక 95 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించారు. కోలుకున్న అనంతరం శుక్రవారం ఆమెను స్థానిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇది అద్భుతమని, మనోస్థైర్యమే ఆమెను కాపాడిందని వైద్యులు వ్యాఖ్యానించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 10న ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె 70 ఏళ్ల కుమారుడు కరోనాతో రెండు వారాల క్రితం మరణించారు.
ఒక్క రోజులో 6 వేలకుపైగా కేసులు
Published Sat, May 23 2020 5:10 AM | Last Updated on Sat, May 23 2020 5:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment