
న్యూఢిల్లీ: వాయు సేనలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని బుధవారం యుద్ధ విమానం సుఖోయ్–30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది. ఈ పరిణామంపై రక్షణ శాఖ, ఐఏఎఫ్ హర్షం వ్యక్తం చేశాయి.
పరీక్ష జరిగిన తీరును రక్షణ శాఖ వివరిస్తూ...గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సుఖోయ్–30 నుంచి బ్రహ్మోస్‌ను ప్రయోగించగా, క్షిపణి ఇంజిన్ రెండు దశల్లో మండి నేరుగా లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. సుఖోయ్‌లో బ్రహ్మోస్‌ను అమర్చడం సవాలుతో కూడుకున్న పని అని ఐఏఎఫ్ వెల్లడించింది. ఇందుకోసం సుఖోయ్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్‌వేర్ పరంగా పలు మార్పులు చేశామని పేర్కొంది.
వాయుసేనకు అమూల్యం....
తాజాగా బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని బ్రహ్మోస్ ఛేదించడం... ఆకాశం నుంచి ఆ క్షిపణిని ప్రయోగించే వాయుసేన సామర్థ్యాన్ని తేటతెల్లం చేస్తోందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో సముద్రం లేదా నేలపై ఉన్న సుదూర లక్ష్యాలను చాలా కచ్చితత్వంతో ఛేదించేందుకు బ్రహ్మోస్ తమకు ఎంతో దోహదపడుతుందని తెలిపింది.
బ్రహ్మోస్, సుఖోయ్–30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ చరిత్ర సృష్టించింది. తొలిసారి సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయాణించి బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది’ అని రక్షణ శాఖ ప్రకటన జారీచేసింది. చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని హర్షం...
సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు...
► 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు.
► ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్–30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే.
► సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు.
► బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది.
► క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది.
► ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు.
► ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు.
► క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది.
► మరో 40 సుఖోయ్–30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.
భారత్‌కు బ్రహ్మస్త్రమే
భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ అందుబాటులోకి వచ్చింది. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ–700 ఒనిక్ సూపర్‌సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)–రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment