
న్యూఢిల్లీ : చైనాలో ఉన్నతవిద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నతవిద్యావకాశాల కోసం ఇప్పుడు బ్రిటన్ కన్నా చైనా వైపే భారతీయ విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా, 2010–11 విద్యాసంవత్సరం నుంచి వైద్యవిద్యను అభ్యసించేందుకు చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో రెండేళ్లుగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా వైద్యవిద్య సీట్లను భర్తీ చేస్తున్నారు. దీంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో విదేశీ వైద్య చదువులకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలోనే పొరుగునే ఉన్న చైనాలో ఎంబీబీఎస్ చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వైద్యకోర్సులకు తక్కువ ఖర్చుతో పాటు, ఆంగ్లంలో బోధన, మెరుగైన ప్రయోగశాల (లేబొరేటరీ) సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి.
దీనికితోడు చైనా వైద్య పట్టాకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తింపు ఇస్తుండటం మరో సానుకూల అంశంగా మారింది. ప్రస్తుతం ఎంసీఐ గుర్తింపు ఉన్న జాబితాలో చైనాలోని 45 ప్రభుత్వ వైద్యవిద్యాసంస్థలున్నాయి. ఈ కాలేజీల్లో విదేశీ విద్యార్థుల కోసం 3,470 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చైనాలో ఉన్నతవిద్య కోసం వెళ్లే భారతీయుల సంఖ్య పదేళ్ల క్రితం వందల్లోనే ఉండేది. కానీ.. 2015లో 13,500 మంది, 2016లో 18,171 మంది ఆ దేశంలో వివిధ కోర్సులు నేర్చుకునేందుకు చైనా వెళ్లారు. ఇతర కోర్సుల విషయంలోనూ అమెరికా, యూకే తర్వాత చైనానే విదేశీవిద్యార్థులు తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
తక్కువ ఖర్చూ ఓ కారణమే!
‘పశ్చిమదేశాలతో పోల్చితే చైనాలో ఖర్చు తక్కువ, ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. నాణ్యమైన విద్యతోపాటు ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలూ చైనాపై ఆసక్తి పెంచుకునేందుకు ఓ కారణం’ అని కెరీర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కరణ్ గుప్తా పేర్కొన్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్‌లతో పాటు హ్యుమానిటీస్, సోషల్‌సైన్సెస్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు కూడా చైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. చైనా అధికారిక లెక్కల ప్రకారం... 2016లో అత్యధికంగా దక్షిణ కొరియా (70,540 మంది విద్యార్థులు), అమెరికా (23,838), థాయ్‌లాండ్ (23,044), పాకిస్తాన్ (18,626), భారత్ (18,171), రష్యా (17,971), ఇండోనేషియా (14,714)ల విదేశీ విద్యార్థులున్నారు. 2020 కల్లా చైనాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు చేరుతుందని నిపుణుల అంచనా.