మందుల మాఫియా ఉచ్చుకు అమాయకుడు బలి | Innocent Trap by drug mafia | Sakshi
Sakshi News home page

మందుల మాఫియా ఉచ్చుకు అమాయకుడు బలి

Published Thu, Sep 8 2016 7:47 PM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

గల్ఫ్‌లో నిషేధిత మందుల వ్యాపారం చేస్తున్న మాఫియా ఉచ్చుకు అమాయకుడు బలి అయ్యాడు.

- నిషేధిత మందులను తీసుకువచ్చాడని..
- జైళ్లో పెట్టిన దుబాయ్ పోలీసులు
- ఎయిర్‌పోర్టులోనే అరెస్టు అయిన తడపాకల్ వాసి
- పార్శిల్ పంపించిన వ్యక్తుల సెల్‌ఫోన్‌లు స్విచ్ ఆఫ్
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా)

గల్ఫ్‌లో నిషేధిత మందుల వ్యాపారం చేస్తున్న మాఫియా  ఉచ్చుకు అమాయకుడు బలి అయ్యాడు. రెండు నెలల సెలవుపై దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ వారం రోజుల కింద మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అయితే అతని వద్ద గల్ఫ్‌లో నిషేధించబడిన మందుల పార్శిల్ దొరకడంతో ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లకముందే దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. మన దేశంలో విరివిగా వినియోగించే అనేక మందులను గల్ఫ్ దేశాలు చాలా ఏళ్ల క్రితమే నిషేధించాయి. ఒంటినొప్పులు, నిద్రమాత్రలు తదితర రకాల మందుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన గల్ఫ్ దేశాలు మందులను నిషేధించడమేకాకుండా ఈ మందులతో పట్టుబడిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాయి. పూసల శ్రీనివాస్ దుబాయ్‌లో ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కార్మికునిగా నాలుగేళ్ల నుంచి పని చేస్తున్నాడు.

 

ఇటీవల కంపెనీ సెలవు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అతను మళ్లీ దుబాయ్‌కు వెళ్లడానికి మోర్తాడ్‌లోని ఒక ట్రావెల్స్‌లో టిక్కెట్ బుకింగ్ చేసుకున్నాడు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి మెట్‌పల్లికి చెందిన ఒక వ్యక్తి నుంచి తీసుకున్న పార్శిల్‌ను శ్రీనివాస్‌కు అప్పగించాడు. దుబాయ్‌లో అజయ్ అనే తమ వ్యక్తి పార్శిల్‌ను రిసీవ్ చేసుకుంటాడని శ్రీనివాస్‌కు వివరించారు. పార్శిల్‌లో ఏమి ఉందో చెప్పకుండానే పార్శిల్ ఇవ్వడంతో శ్రీనివాస్ దానిని తన లగేజీలో పెట్టుకుని దుబాయ్ చేరుకున్నాడు.

 

అయితే నిషేధిత మందుల రవాణాపై నిఘాను తీవ్రతరం చేసిన దుబాయ్ పోలీసులు శ్రీనివాస్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. లగేజీలో పార్శిల్ దొరకడంతో దానిని పరిశీలించగా నిషేధిత మందులు లభ్యం అయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులోనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ పార్శిల్‌లో ఏమి ఉందో తనకు తెలియదని దుబాయ్‌లో తాను ఉండే క్యాంపునకు అజయ్ అనే వ్యక్తి వచ్చి తీసుకువెళతాడని శ్రీనివాస్ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. అంతేకాక అజయ్ సెల్‌నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అయ్యింది. జైళ్లో బందీగా ఉన్న శ్రీనివాస్ తన అరెస్టు విషయాన్ని తన సహచరుల ద్వారా కుటుంబ సభ్యులకు అందించాడు.

 

ఇక్కడ పార్శిల్ అందించిన వ్యక్తుల ఫోన్‌లు కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. పొట్టకూటి కోసం దుబాయ్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ జైలు పాలుకావడంతో ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీనివాస్‌ను ఈనెల చివరి వారంలో దుబాయ్ పోలీసులు కోర్టులో హాజరు పరిచితే ఎంత కాలం శిక్ష పడుతుందో స్పష్టం కానుంది. మందుల మాఫియా ధన దాహానికి ఇప్పటికే ఎంతో మంది అమాయకులు బలి అయ్యారు. కొందరు శిక్షలు అనుభవిస్తుండగా మరికొందరు ఎంతో ఖర్చు పెట్టుకుని ఇళ్లకు చేరుకున్నారు. విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అమాయకుడైన శ్రీనివాస్‌ను విడిపించాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement