
లక్నో: ఒక్క క్షణం ఆలస్యం అయితే ఒక వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవే. కానీ అత్యవసర విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అనూహ్యంగా కొన ఊపిరితో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన వైనం అద్భుతంగా నిలిచింది. ఉత్తరప్రదేశ్, హర్దోయిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే భార్యభర్తల మధ్య స్వల్ప వివాదంతో భర్త శివకుమార్ క్షణికావేశానికి లోనయ్యాడు. గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అందోళన చెంది భార్య వెంటనే పోలీసులు సమాచారమిచ్చింది. దీంతో మరింత వేగంగా స్పందించిన కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ వాయు వేగంతో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే గదిలోపల శివకుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన సురేంద్రకుమార్ తలుపులు పగుల గొట్టి మరీ అతడిని కిందికి దించాడు. కానీ శివకుమార్‌లో ఎలాంటి చలనం లేదు. అయితే ఏ మాత్రం నిరాశపడని సురేంద్ర అతనికి సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్)థెరపీని ప్రారంభించాడు. కాపేటికి బాధితుడు స్పందించడంతో, ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడాడు.
బాధితుడిలో చలనం లేకపోవడంతో, ఛాతీపై అరచేతితో తడుతూ, సీపీఆర్ థెరఫీ ప్రయోగించానని, కొంత సమయం తరువాత అతను స్పందించి శ్వాస తీసుకోవడం ప్రారంభించాడని, చివరి క్షణాల్లో అతనికి ఊపిరి పోయడం చాలా సంతోషంగా ఉందని కానిస్టేబుల్ సురేంద్ర తెలిపారు. ప్రస్తుతం శివకుమార్ కోలుకుంటున్నాడని, ప్రమాదం తప్పిందని వైద్యులు చెప్పారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సరియైన సమయంలో వేగంగా, సమర్ధవంతంగా స్పందించి సత్వర చర్య చేపట్టిన సురేంద్ర కమార్‌కు తగిన బహుమతిని త్వరలోనే అందిస్తామని ప్రకటించారు.