పాకిస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోందా?
భువనేశ్వర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. డిసెంబర్ 31న ఉగ్రవాదుల బోటు పేలుడు ఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన తప్పుపట్టారు. పాకిస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భారత్ నుంచి ఎన్నికల్లో పోరాడుతోందా లేక పాకిస్థాన్ నుంచా అన్న విషయం ఆ పార్టీకి తెలియదని భావిస్తున్నానని అమిత్ షా వ్యాఖ్యానించారు.
సున్నితమైన విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయకుండా రాహుల్ గాంధీ నిరోధించాలని అమిత్ సూచించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేయడం మాని, భద్రత బలగాలకు మద్దతుగా నిలవడం ప్రతిపక్ష పార్టీ బాధ్యతని అన్నారు. డిసెంబర్ 31న పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పోరుబందర్ సమీపంలో భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది వేటాడంతో ఉగ్రవాదులు బోటులో పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు వచ్చారని నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి స్పందిస్తూ.. ఉగ్రవాదిదాడిని నిరోధించామని ప్రభుత్వం ఎలా చెబుతుంది? ఎలాంటి సాక్ష్యం లేదని విమర్శించారు. దీనిపై అమిత్ షా ప్రతిస్పందించారు.