
ఇష్రత్ కేసు పేపర్లు మాయం
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించిన గల్లంతైన ఫైళ్లపై కేంద్ర హోంశాఖ అంతర్గత దర్యాప్తు కమిటీ 52 పేజీల నివేదికను సమర్పించింది. 2009లో చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖ నుంచి తెలిసో, తెలియకో ఎవరైనా తీయడం వల్లనో, మరేదైనా కారణం వల్లనో ఈ డాక్యుమెంట్లు కనిపించకుండా పోయాయని దర్యాప్తులో తేలింది. వాటిలో ఒకటి మాత్రం దొరికినట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి బీకే ప్రసాద్ తన నివేదికలో పేర్కొన్నారు.
ఆయన హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మిస్త్రీకి ఈ నివేదికను అందజేశారు. 2009, సెప్టెంబర్ 18-28 మధ్య ఈ డాక్యుమెంట్లు మాయమయ్యాయని పేర్కొన్నారు. ఈ నివేదికలో చిదంబరం గురించి ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హత్యకు కుట్రపన్నారంటూ ఇష్రత్ తో పాటు మరో ముగ్గురిని 2004లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే వారు అమాయకులని నాటి కేంద్ర హోంశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది.
భారతీయుడని నిరూపించుకోండి..
ఈ ఎన్‌కౌంటర్ కేసు డాక్యుమెంట్లు, కమిటీ నివేదిక కావాలని ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన భారతీయుడని నిరూపించుకునే డాక్యుమెంట్లు ఇచ్చాక సమాచారం ఇస్తామని కేంద్రం పేర్కొంది.