‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ సాంకేతికతను పరీక్షిస్తున్న దృశ్యం, బెలూన్ సాయంతో సురక్షితంగా కిందకు దిగుతున్న మాడ్యూల్
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/ బెంగళూరు / హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష యాత్రల దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ముందడుగు వేసింది. అంతరిక్ష నౌకల్ని ప్రయోగించే సమయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే అందులోని వ్యోమగాముల్ని కాపాడేందుకు ఉద్దేశించిన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను గురువారం తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగం సందర్భంగా వాహకనౌకలో ఏదైనా సమస్య తలెత్తితే.. వెంటనే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అప్రమత్తమై వ్యోమగాములున్న మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరుచేసి దూరంగా, సురక్షితంగా దిగేలా చేస్తుంది.
ఈ వ్యవస్థ సామర్థ్యం, విశ్వసనీయతను పరిశీలించేందుకే తాజా ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. రాకెట్ 259 సెకన్లపాటు ఆకాశంలోకి దూసుకెళ్లిన అనంతరం క్రూ ఎస్కేప్ వ్యవస్థ వ్యోమగాములు కూర్చునే మాడ్యూల్‌ను వేరుచేసినట్లు పేర్కొంది.
దాదాపు 12.6 టన్నుల బరువున్న ఈ మాడ్యూల్ ప్రత్యేకంగా అమర్చిన మోటార్ల సాయంతో 2.7 కి.మీ ఎత్తునుంచి వాహకనౌకకు దూరంగా, సురక్షితంగా బంగాళాఖాతంలో దిగిందని ఇస్రో తెలిపింది. దాదాపు 300 సెన్సార్ల సాయంతో ఈ ప్రయోగాన్ని నిశితంగా పరిశీలించినట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో దిగిన మాడ్యూల్‌ను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చినట్లు పేర్కొంది. ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి భూమిపైకి తిరిగిరాగల పునర్వినియోగ వాహకనౌకను ఇస్రో గతంలో పరీక్షించిన సంగతి తెలిసిందే. 2014లో జీఎల్‌ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా 3 వ్యోమగాములు పట్టే డమ్మీ మాడ్యూల్‌ను సైతం ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.
చాలా దూరంలో ఉన్నాం: కిరణ్‌కుమార్
మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు భారత్ ఇంకా చాలా పురోగమించాల్సి ఉందని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘మానవసహిత అంతరిక్ష యాత్రల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ ప్రయోగాలను క్రమపద్ధతిలో ఒకదానితర్వాత మరొకటి చేపట్టాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా ప్రస్తుతం ఇస్రో చేపడుతున్నవన్నీ ప్రాథమికస్థాయి పరీక్షలే. మనకు అందుబాటులో పరిమిత వనరుల సాయంతోనే ఈ కీలక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నాం’ అని కిరణ్ కుమార్ తెలిపారు.
కాగా, మానవసహిత యాత్రల్లో కావాల్సిన వాతావరణ నియంత్రణ, ప్రాణాధార, ఇతర సాంకేతిక వ్యవస్థలతో పాటు ప్రత్యేకమైన దుస్తుల తయారీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు బెంగళూరులోని ఇస్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. మానవసహిత అంతరిక్ష యాత్రకు కేంద్రం ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. భారీ వ్యయం కారణంగానే ప్రభుత్వం మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని గతంలో కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment