
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (ఫైల్‌ఫోటో)
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. తాజాగా సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. సిద్ధరామయ్య బరిలో నిలిచిన బాదామి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతకు చెందిన ఓ రిసార్ట్‌పై ఐటీ దాడులు జరిగాయి. రాజకీయ కక్ష సాధించేందుకే ఈ దాడులు జరిగాయని, వీటికి ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా బాధ్యత వహించాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనున్న క్రమంలో ఐటీ దాడులు జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంపై బీజేపీ స్పందించింది. దాడులు జరిగిన సమయాన్ని అనుమానించడం తగదని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్న నేపథ్యంలో చీకటి ఒప్పందాలను రట్టు చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ప్రతినిధి సంబిట్ పాత్రా అన్నారు. అక్రమ ఒప్పందాలను నియంత్రించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.
మరోవైపు కర్ణాటకలో ప్రచారానికి తుదిగడువు సమీపిస్తుండటంతో అగ్రనేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ ప్రచార బరిలోకి దిగడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్యం మాటల యుద్ధం ముదిరింది. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 15న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.