సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు రైళ్లు నిలిచిపోనున్నాయి. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు రెండు మూడింటిని అవసరాన్ని బట్టి నడిపించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ముందే ప్రయాణం ప్రారంభించిన దూరప్రాంత రైళ్లు మాత్రం యథావిధిగా గమ్యం వైపు వెళ్లనున్నాయి. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు)
కానీ ఉదయం 7 నుంచి రాత్రి 9 మధ్య ప్రారంభమయ్యే మిగతా అన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి 2,400 సర్వీసులు, దూర ప్రాంతాలకు తిరిగే రైళ్లకు సంబంధించి దాదాపు 1,300 సర్వీసులు నిలిచిపోనున్నాయి. నగరంలో తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లలో రెండు, మూడు మినహా మిగతావాటిని నిలిపేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లోనూ రేపు మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోన్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో సర్వీసులు నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాము ఏ నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం నుంచి ఆదేశం వస్తే శనివారం నిర్ణయిస్తామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ అర్థరాత్రి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. దీంతో ఏపీలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. (జనతా కర్ఫ్యూ.. మెట్రో సేవలు బంద్)
టికెట్ క్యూలో మీటర్ దూరం
కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉన్నా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా రైళ్లు నడుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కార్యాలయాలు, సాధారణ బుకింగ్ కేంద్రాలు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌ల వద్ద, పార్శిల్ కార్యాలయాల వద్ద ఒకరికి ఒకరికి మధ్య మీటర్ దూరం ఉండేలా ఫ్లోర్‌పై మార్కింగ్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో ఉన్న రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీలను మూసేయాలని రైల్వే నిర్ణయించింది. శనివారం రాత్రి 12 నుంచి ఏప్రిల్ 15 రాత్రి 12 వరకు వీటిని మూసి ఉంచాలని నిర్ణయించింది. (జనతా కర్ఫ్యూ సరే, ప్రభుత్వ చర్యలేవీ!?)
Comments
Please login to add a commentAdd a comment