జన ధన ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ! | Jandhan accounts being flooded with deposits from others | Sakshi
Sakshi News home page

జన ధన ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ!

Published Sat, Nov 12 2016 8:59 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

జన ధన ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ! - Sakshi

జన ధన ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ!

ఇప్పటివరకు వాళ్లు బ్యాంకు ఖాతా తెరవడమే తప్ప.. అందులో పెద్దగా డబ్బులు వేసింది, తీసింది ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా వాటిలోకి వేలాది రూపాయల డిపాజిట్లు వచ్చి పడుతున్నాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి జనధన యోజన ఖాతాల్లోకి డబ్బు రావడం ఎక్కువైంది. 2014 ఆగస్టు నెలలో జనధన యోజనను ప్రారంభించారు. గ్రామీణులు, పేదలు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న సదుద్దేశంతో కేంద్రం వీటిని ప్రారంభించింది. వాటిలో రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ పద్ధతిలో నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇదే ఇప్పుడు అక్రమార్కుల పాలిట వరమైంది. తమ దగ్గర భారీ మొత్తంలో ఉన్న నల్లధాన్ని తెల్లగా మార్చుకోడానికి ఈ ఖాతాలను వాళ్లు వాడుకుంటున్నారు. ప్రతి ఖాతాలోనూ పాన్ నెంబరుతో పనిలేకుండా ఉండేందుకు 49వేల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. 
 
ఈ డబ్బంతా వేరేవాళ్లది. ఈ విషయంలో మధ్యదళారులు రంగప్రవేశం చేస్తున్నారు. 49వేల రూపాయలు మీ ఖాతాలో వేసుకుంటే మీకు పరపతి పెరుగుతుందని వాళ్లను మభ్యపెట్టడంతో పాటు.. అలా డిపాజిట్ చేసుకున్నందుకు వాళ్లకు రూ. 500 కూడా ఇస్తున్నారు. తమ పరపతి నిజంగానే పెరుగుతుందని భ్రమపడిన అమాయకులు సరేనని తమ ఖాతాల్లో ఆ డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. తమ బ్రాంచిలో 15వేల జనధన ఖాతాలు ఉన్నాయని, వాటిలోని 30 శాతం ఖాతాల్లో ఒక్కసారిగా గురువారం నుంచి 49వేల రూపాయల చొప్పున డిపాజిట్లు వచ్చి పడ్డాయని ఆగ్రాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అజయ్ అగ్నిహోత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో దాదాపు అన్ని ఖాతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. 
 
కొందరు ఫ్యాక్టరీల యజమానులు కూడా తమ వద్ద పనిచేసే ఉద్యోగుల ఖాతాల్లోకి బలవంతంగా డబ్బు వేయిస్తున్నారని, అయితే.. ఇలా వేరేవాళ్ల డబ్బులు తమ ఖాతాల్లోకి వేసుకున్నా అదంతా ప్రభుత్వ లెక్కల్లోకి వెళ్తుందన్న విషయాన్ని ఖాతాదారులు గుర్తించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement