‘జన్ ధన్’ నుంచి దనాధన్ విత్‌డ్రాలు
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ‘జన్ ధన్ యోజన’ ఖాతాల్లోకి ఎంత వేగంగా డిపాజిట్లు వచ్చి పడ్డాయో, ఇప్పుడు దాదాపు అంతే వేగంగా ‘విత్ డ్రా’లతో ఖాళీ అవుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ 8వ తేదీ నాటికి జన్ ధన్ ఖాతాల్లో దాదాపు 45 వేల కోట్ల రూపాయలుండగా, అప్పటి నుంచి నవంబర్ 30వ తేదీ నాటికి ఆ ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం 74,321 కోట్ల రూపాయలకు చేరుకుంది. మార్చి 15వ తేదీ నాటికి డిపాజిట్ల మొత్తం సొమ్ము 63,836 కోట్ల రూపాయలకు తరగిపోయింది. అంటే దాదాపు 10,500 కోట్ల రూపాయలు విత్ డ్రా అయ్యాయి.
ఇందులో ఎక్కువ సొమ్మును పన్ను ఎగవేతదారుల సొమ్ముగానే భావించాల్సి వస్తుంది. కానీ ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తేసిన మార్చి 13 నుంచి ఇప్పటి వరకు జరిగిన విత్ డ్రాల డేటాను ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పలు బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జన్ ధన్ యోజన ఖాతాల్లోనే ఎక్కువ సొమ్ము డిపాజిట్ అయింది. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. యూపీ జన్ ధన్ ఖాతాల్లో నవంబర్ నుంచి డిసెంబర్‌లోగా దాదాపు 4,500 కోట్ల రూపాయలు డిపాజిట్ కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 2,900 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి.
యూపీ ఖాతాల్లో 7,493 కోట్ల రూపాయలుండగా, 12,021 కోట్ల రూపాయలకు డిపాజిట్లు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6,286 కోట్ల రూపాయలుండగా, 9,193 కోట్ల రూపాయలకు డిపాజిట్లు చేరుకున్నాయి. ఇప్పుడు అవే డిపాజిట్లు యూపీలో 10,154 కోట్ల రూపాయలకు తరగిపోగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 8,213 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 28, 2014లో ప్రారంభించిన జన్‌ధన్ యోజన పథకంలో 2015, జనవరి 26వ తేదీ నాటికి 28 కోట్ల ఖాతాలను తెరిచారు. వాటిలో ప్రస్తుతానికి 65 శాతం ఖాతాలను ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు.