జయతో ప్రధాని భేటీ | jayalalithaa hosts lunch for Modi | Sakshi
Sakshi News home page

జయతో ప్రధాని భేటీ

Published Sat, Aug 8 2015 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

జయతో ప్రధాని భేటీ - Sakshi

జయతో ప్రధాని భేటీ

తమిళనాడు సీఎం నివాసంలో గంట సమావేశం  అక్కడే లంచ్ చేసిన మోదీ
చెన్నై: పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు కీలక బిల్లుల ఆమోదం అగమ్యగోచరమైన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో భేటీ అయ్యారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన నేరుగా జయ నివాసం పోయెస్ గార్డెన్‌కు వెళ్లారు. తొలిసారి తన ఇంటికి వచ్చిన మోదీకి గుమ్మం వద్దకు ఎదురెళ్లి జయ సాదర స్వాగతం పలికారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన మోదీ.. దాదాపు 50 నిమిషాల పాటు జయతో పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చే పలు డిమాండ్లను జయలలిత ప్రధాని ముందుంచారు. ఒక వినతిపత్రాన్ని సైతం అందించారు. బీజేపీలోని కీలక నేతల రాజీనామాలపై కాంగ్రెస్, లెఫ్ట్ సహా పలు విపక్షాలు పట్టువీడని వైఖరి అవలంబిస్తున్న పరిస్థితుల్లో జీఎస్టీ సహా పలు కీలక సంస్కరణాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో జయతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జయ పార్టీ అన్నాడీఎంకేకు లోక్‌సభలో 37 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లుకు లోక్‌సభలో అన్నాడీఎంకే మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్రస్థాయిలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నా.. ఇరువురు నేతల మధ్య మాత్రం  సౌహార్ద సంబంధాలే నెలకొని ఉన్నాయి. 2011లో సీఎంగా జయ ప్రమాణ స్వీకారానికి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ హాజరుకాగా, ఆ తరువాత 2012లో గుజరాత్ సీఎంగా మోదీ ప్రమాణానికి జయలలిత హాజరయ్యారు.
 
సహకరించండి!
ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై జయలలిత మోదీ సాయం కోరారు. కర్నాటక, కేరళలతో అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యను పరిష్కరించాలని, శ్రీలంక తమిళుల సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని ప్రధానికందించిన వినతితో కోరారు.  కావేరీ నదీ జలాలపై మేనేజ్‌మెంట్ బోర్డ్‌ను, కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, కేరళలోని అసాంఘిక శక్తుల నుంచి ముళ్లపెరియార్ డ్యామ్ భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు.

జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే తమిళనాడు ఏటా రూ. 9270 కోట్లు నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు రాష్ట్రాలకు 100% పరిహారం ఇచ్చేందుకు రాజ్యాంగబద్ధ పరిహార విధానం కావాలని, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదని అన్నారు. శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని భారత్ తిరిగి స్వాధీనపర్చుకోవాలని కోరారు.
 
చో రామస్వామికి మోదీ పరామర్శ
జయలలిత నివాసం నుంచి ప్రధాని మోదీ సీనియర్ జర్నలిస్ట్, ‘తుగ్లక్’ పత్రిక ప్రధాన సంపాదకుడు చో రామస్వామి ఇంటికి వెళ్లారు. కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్న తన చిరకాల మిత్రుడు రామస్వామిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడ మోదీ దాదాపు 10 నిమిషాలు గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement