
పాత్రికేయులను దూషించిన వీకే సింగ్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాత్రికేయులు, మీడియా ప్రతినిధులను ‘ప్రెస్టిట్యూట్స్’ అంటూ దూషణపూర్వకంగా అభివర్ణించి.. ప్రసార సంపాదకుల సంఘం (బీఏఈ) నుంచీ, పలు రాజకీయ పార్టీల నుంచీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యెమెన్ నుంచి భారతీయులను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రస్తుతం జిబోటిలో ఉన్న వి.కె.సింగ్ మంగళవారం నాడు.. తాను ఇటీవల ఢిల్లీలో పాక్ దౌత్యకార్యాలయం సందర్శనతో పోల్చితే.. భారతీయులను రక్షించే కార్యక్రమం ఏమంత ఉత్సాహకరంగా లేదన్నారు.
ఈ వ్యాఖ్యలను ఒక టీవీ చానల్ తన కథనంలో విమర్శించటంపై స్పందిస్తూ.. ‘‘ప్రెస్టిట్యూట్ల’ నుంచి ఏం ఆశిస్తాం’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ స్పందిస్తూ.. సింగ్ తన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారంది. సింగ్ వివాదాస్పద ట్వీట్లతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.