ఉగ్రవాదం పేరుతో అమాయకులైన ముస్లిం యువతను వేధించవద్దని కేంద్ర హోంమంత్రి షిండే ఇచ్చిన ఆదేశాలను చెత్తబుట్టలో పడవేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
తమ సీఎంలకు బీజేపీ సూచన
బెంగళూరు: ఉగ్రవాదం పేరుతో అమాయకులైన ముస్లిం యువతను వేధించవద్దని కేంద్ర హోంమంత్రి షిండే ఇచ్చిన ఆదేశాలను చెత్తబుట్టలో పడవేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. షిండే దేశానికి హోం మంత్రా లేక ఒక మతానికి హోంమంత్రా అని బీజేపీ సూటిగా ప్రశ్నించింది. బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, షిండేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విభజించి పాలించే ఎజెండాతో పనిచేస్తున్నదని విమర్శించారు. షిండే ఆదేశాలు లౌకికవాదానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనవన్నారు. దేశంలో అమాయకులెవరూ అరెస్ట్ కాకుండా చూడడమే సరైన విధానమన్నారు. షిండే మాత్రం అమాయకులైన ముస్లింలను మాత్రమే అరెస్ట్ చేయవద్దని సూచించడం, పైగా దానిని సమర్థించుకోవడం దారుణమన్నారు. అందుకే షిండే ఆదేశాలను చెత్తబుట్టలో వేయాలని సూచిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు.