నూతలపాటి వెంకట రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.
అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్‌ఎస్‌సీ) కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఎస్సీఎల్‌ఎస్‌సీలో పెండింగ్ కేసులు తగ్గాయి. జనవరి 2018 లో 3,800 కేసులు ఉండగా.. ఆగస్టు 2019 నాటికి 1811కు తగ్గాయి. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు.
నల్సా డైరెక్టర్ సునీల్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించారు. న్యాయ సేవలు అందించడంలో సమర్థతను, న్యాయ సేవలు పొందగలిగే అవకాశాలను పెంపొందించడంపై చర్చించారు. నల్సా భవిష్యత్తు కార్యక్రమాలకు మార్గదర్శకంగా జస్టిస్ ఎన్.వి.రమణ ఒక విజన్ స్టేట్‌మెంట్‌ను ఆవిష్కరించారు. లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం, డిజిటైజేషన్ చేయడం, న్యాయ సేవలు పొందడంలో ప్రొటోకాల్ రూపొందించడం వంటి కార్యక్రమాలపై నల్సా దృష్టిపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment