‘మరో చరిత్ర’ ముగిసింది
* దర్శక శిఖరం కె. బాలచందర్ ఇక లేరు
* అస్వస్థతతో చెన్నైలో కన్నుమూత
* సినీ చరిత్రకే మకుటాయమానమైన చిత్రాలను తీసిన కేబీ
* ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంపై తొలి గుర్తింపు
* మరోచరిత్ర, అంతులేనికథ, ఆకలిరాజ్యం వంటి ఎన్నో మరపురాని చిత్రాలకు దర్శకత్వం
* దర్శక శిఖరం మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
సాక్షి, చెన్నై, హైదరాబాద్: మరో చరిత్ర ముగిసింది.. రుద్రవీణ మూగబోయింది.. భారత సినీ పరిశ్రమలో ధ్రువతారగా వెలిగిన దర్శక శిఖరం నేలకొరిగింది.. చిత్ర పరిశ్రమకు మకుటాయమానంగా వెలిగిన కైలాసం బాలచందర్(84) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
తమిళనాడులోని తిరువారూర్ (గతంలో తంజావూరు జిల్లా) జిల్లా నన్నిలం గ్రామంలో దండపాణి కైలాసం, సరస్వతి దంపతులకు 1930, జూలై 9న బాలచందర్ జన్మించారు. 1956లో రాజంను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు (కైలాసం, ప్రసన్న), ఓ కూతురు(పుష్పా కందసామి). అనారోగ్యంతో పెద్ద కుమారుడు కైలాసం ఇటీవల మృతి చెందడంతో బాలచందర్ బాగా కుంగిపోయారు. అదే బెంగతో అస్వస్థతకు గురై ఈనెల 15న ఆస్పత్రిలో చేరారు. చిన్నతనం నుంచే నాటకాలు, చిత్రాలపై మక్కువ పెంచుకున్న బాలచందర్‌పై.. త్యాగరాజ భాగవతార్ సినిమాలు ప్రభావం చూపాయి. బాలచందర్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది.
12 ఏళ్ల ప్రాయంలోనే నటన వైపు...
తమిళ, తెలుగు సినిమాను వైవిధ్య భరితమైన కథాంశాలతో ఓలలాడించిన దర్శక వైతాళికుడు కె.బాలచందర్(కేబీ) తన 12 ఏళ్ల ప్రాయంలోనే నటనవైపు అడుగులు వేశారు. ఒక నాటిక సమాజంలో సభ్యుడిగా చేరి పేరు తెచ్చుకున్నారు. అన్నామలై యూనివర్సిటీ ద్వారా 1949లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి 1950లో తిరువారూరు జిల్లా ముత్తుపేటలో టీచర్‌గా పనిచేశారు. తర్వాత 1956లో చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సాధారణ అకౌంటెంట్‌గా చేరారు. అదే ఏడాది రాజంను పెళ్లిచేసుకున్నారు. ఆ సమయంలో యునెటైడ్ అమెరికన్ ఆర్టిస్ట్ (మద్రాసు) నాటక కంపెనీలో సభ్యుడిగా చేరి కొద్ది కాలంలోనే సొంతంగా నాటక బృం దాన్ని ఏర్పరుచుకున్నారు. స్వీయ దర్శకత్వంలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి రంగస్థల ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.
ఆయన రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంలో గుర్తిం పు తెచ్చుకున్నారు. ఎంజీ రామచంద్రన్ హీరోగా నటించిన ‘దైవత్తాయ్’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా 1965లో సినీ పరిశ్రమకు పరిచయమయ్యూరు. ఆ తర్వాత ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీ మెయ్యప్పన్ ప్రోత్సాహంతో ‘సర్వర్ సుం దరం’ చిత్రానికి స్క్రిప్ట్ సహకారం అందించారు. 1965లో ‘నీర్‌కుముళి’తో దర్శకుడిగా మారారు. 1981లో కవితాలయా ప్రొడక్షన్స్‌ను సొంతంగా స్థాపించి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో ఎన్నో చిత్రరాజాలను ప్రేక్షకులకు అందించారు.
దర్శకుడిగా 101 సినిమాలు..
స్టార్ హీరోలతో సినిమాలు చేయడం బాలచందర్‌కి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. తన కథలు స్టార్లకు నప్పవని, వాళ్ల డేట్స్, కాలపరిమితికి లోబడి పనిచేయడం తన వల్ల కాదని కరాకండీగా చెప్పేవారు. సాధ్యమైనంత వరకూ కొత్తవారితోనే పని చేసేవారు. దాదాపు వందకు పైచిలుకు కొత్త నటులను తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. దర్శకుడిగా 101 సినిమాలు చేశారాయన. వాటిలో తమిళంలోనే దాదాపు 80 సినిమాలుంటాయి. అన్నీ ఆణిముత్యాలే. బాలచందర్ సినిమాల్లో కాలం కోరల్లో నలిగిపోతున్న సగటు జీవితాలు కనిపిస్తాయి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ 1970ల్లోనే వెండితెరపై ఆవిష్కరించిన సృజనశీలి బాలచందర్. నిరుద్యోగం, అంటరానితనం, కట్టుబాట్లు, వ్యసనాలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక రుగ్మతలపై ఎన్నో సినిమాలు తీశారు.
దర్శకుడు బాలచందర్ చాలా జానర్లు స్పృశించలేకపోవచ్చు. కానీ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ అన్ని వర్గాలను రక్తికట్టించాయి. సగటు జీవితాలు ఎదుర్కొంటున్న సున్నిత సమస్యల్ని ఆయన ఎంత సునిశితంగా చూస్తారో చెప్పడానికి ‘అం తులేని కథ’ ఓ మచ్చుతునకగా మిగిలిపోతుంది. తెలుగులో ఆయన భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, అందమైన అనుభవం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, రుద్రవీణ వంటి ఆణిముత్యాలను తెరకెక్కించారు. రజనీ కాంత్‌ని ‘అపూర్వరాగంగళ్’తో వెండితెరకు పరిచయం చేసింది బాలచందరే. ‘మరో చరిత్ర’ ద్వారా కమల్‌హాసన్, సరితలను హీరోహీరోయిన్లుగా పరి చయం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రాన్ని నిర్మించి, సినీ లోకానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పరిచ యం చేసిన ఘనత బాలచందర్‌దే. ‘డ్యూయెట్’ చిత్రం ద్వారా ప్రకాశ్‌రాజ్‌ను వెలుగులోకి తెచ్చారు.
నటుడిగా.. : దర్శకుడిగా ఖ్యాతిపొందినా అప్పుడప్పుడూ నటుడిగా కూడా కనిపించారు బాలచందర్. చిన్నచిన్న పాత్రలతో ఐదు సినిమాల్లో నటుడిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. ‘రెట్టైసుళి’ అనే తమిళ చిత్రంలో ప్రధాన పాత్ర చేసి మెప్పిం చారు. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా రూపొందిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కూడా బాలచందర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది.
ఎన్నెన్నో అవార్డులు...
పద్మశ్రీ(1987), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(2011), జాతీయ అవార్డు(2013), పలు ఫిలింఫేర్ అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలు బాలచందర్‌ను వరించాయి. ఇవిగాక ప్రైవేటు సంస్థలు అందజేసిన అవార్డులు కోకొల్లలు. సినిమాలకు దూరమైన దశలో ఎన్నో టీవీ సీరియళ్లకు దర్శకత్వం అందించారు.